- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికార గణం ‘అక్రమ’ బంధం..? ప్రశ్నించే గొంతుకపైనే దౌర్జన్యం!
'ప్రజావాణి'లో ఫిర్యాదుదారుడిని అవమానకరంగా బయటకు పంపడం సంచలనం సృష్టించగా, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు అధికార యంత్రాంగంలో కదలిక తెస్తుందా..? అనేది ప్రశ్ననే.

దిశ, మేడ్చల్ బ్యూరో: 'ప్రజావాణి'లో ఫిర్యాదుదారుడిని అవమానకరంగా బయటకు పంపడం సంచలనం సృష్టించగా, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు అధికార యంత్రాంగంలో కదలిక తెస్తుందా..? అనేది ప్రశ్ననే. సుచిర్ ఇండియా, వాసవి నిర్మాణ్ వెంచర్ అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వి.హరికృష్ణను పోలీసులు, సెక్యూరిటీ బలవంతంగా బయటకు పంపడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు అధికార యంత్రాంగం యొక్క 'అధఃపాతాళ' స్థితికి నిదర్శనంగా నిలిచాయి. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో జరిగిన 'ప్రజావాణి'లో, ఒక బాధితుడిని పోలీసులతో బయటకు గెంటేయడం చూస్తుంటే, అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సుచిర్ ఇండియా, వాసవి నిర్మాణ్ అక్రమాలపై ప్రశ్నించిన హరికృష్ణను, అధికారులే నిలదీయడం చూస్తుంటే, డెవలపర్లతో అధికారులకు ఉన్న 'అక్రమ బంధం' ఎంత లోతైనదో బహిర్గతమవుతోంది అంటూ తప్పుబడుతున్నారు.
అధికారులు.. డెవలపర్ల జేబులో ఉన్నారా?
దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో అక్రమాలు జరుగుతున్నాయని ఇరిగేషన్ శాఖే ఎన్.ఓ.సి రద్దు చేసినా, హెచ్.ఎమ్.డి.ఏ నోటీసులు ఇచ్చినా.. ఇప్పటికీ ఆ వెంచర్‌లో నిర్మాణాలు ఎలా సాగుతున్నాయి? అంటే, అధికారులు డెవలపర్లతో కుమ్మక్కు అయ్యారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముండాలి? "నిబంధనలు గాలికి వదిలేసిన నిర్మాణ సంస్థల ముందే అధికారులు సాగిలపడుతున్నారు" అని సామాన్యులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను అమలు చేయాల్సిన అధికారులు, డెవలపర్ల ప్రయోజనాలను కాపాడటానికే ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టమవుతోంది.
ప్రశ్నిస్తే అవమానమా? ఇది అధికారుల చేతగానితనానికి పరాకాష్ట!
ప్రజా సమస్యలను వినాల్సిన మున్సిపల్ కార్యాలయం, ఇప్పుడు 'పెద్ద సంస్థల రక్షణ కేంద్రం'గా మారిపోయింది. తన ఆవేదనను చెప్పుకోవడానికి వచ్చిన వ్యక్తిని, కనీస గౌరవం లేకుండా పోలీసుల సహాయంతో బయటకు పంపడం అధికారుల 'చేతగానితనానికి' పరాకాష్ట. సమస్యను పరిష్కరించలేక, నిజాన్ని నిలదీయలేక, ప్రశ్నించిన వ్యక్తిపైనే దౌర్జన్యం చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటి? ఆ డెవలపర్ల నుంచి అధికారులు ఏ మేరకు ముడుపులు అందుకున్నారో విచారణ జరిపితే తప్ప వాస్తవాలు బయటపడవు.
దందా కోసమే టౌన్ ప్లానింగ్ విభాగం..?
ప్రతి సోమవారం జరిగే 'ప్రజావాణి'లో వస్తున్న ఫిర్యాదుల్లో 17 టౌన్ ప్లానింగ్ విభాగంపైనే ఉండటం, ఈ వ్యవస్థలో ఉన్న అవినీతికి అద్దం పడుతోంది. "ప్రజల కష్టాలను తీర్చాల్సిందే పోయి, బడా సంస్థల అక్రమాలకు పరోక్షంగా సహకరిస్తూ, హరికృష్ణ వంటి బాధితులను అవమానించడం సిగ్గుచేటు" అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు తమ విధులు సరిగ్గా నిర్వహిస్తే పిర్యాదులు ఎందుకు వస్తాయి? కేవలం దందా చేయడానికే టౌన్ ప్లానింగ్ విభాగం పనిచేస్తుంది అంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, సుచిర్ ఇండియా-వాసవి సంస్థలతో కుమ్మక్కైన అధికారులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.






