సింగరేణిని కేసీఆర్ తన జేబు సంస్థగా మార్చుకున్నారు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-14 06:10:44  IST  )

బీఆర్ఎస్ హయాంలో.. సింగరేణిని అప్పటి సీఎం కేసీఆర్ తన జేబు సంస్థగా మార్చుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

సింగరేణిని కేసీఆర్ తన జేబు సంస్థగా మార్చుకున్నారు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ హయాంలో.. సింగరేణిని అప్పటి సీఎం కేసీఆర్ తన జేబు సంస్థగా మార్చుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. భూపాలపల్లిలో బీజేపీ చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర రెండోరోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో సింగరేణి 15 సంవత్సరాలు వెనుకబడిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో కూడా సింగరేణిలో అదే పరిస్థితి నెలకొందని, ప్రస్తుతం సంస్థకు లాభాలు లేక కార్మికులు ఆందోళన చెందుతున్నారన్నారు. సింగరేణి అభివృద్ధిపై కేసీఆర్ ఏనాడూ కేంద్రాన్ని సంప్రదించలేదన్నారు. సింగరేణి వాళ్ల తాత జాగీరు అన్న చందంగా గత, ప్రస్తుత ప్రభుత్వాలు వ్యవహరించాయని ఆరోపించారు. సింగరేణి పేరుతో బీఆర్ఎస్ నేతలు వేలకోట్ల రూపాయలను దోచుకున్నారన్నారు. సింగరేణి నిధులను ఆ ప్రాంతంలోనే ఖర్చు చేయకుండా.. కేసీఆర్ కుటుంబ సభ్యుల నియోజకవర్గాల్లో ఖర్చు చేశారని, గతంలో కేంద్రం మనకు కోల్ బ్లాక్ లు ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు.

కేసీఆర్ పాలనలో జెన్ కో కు రూ.8,958 కోట్ల అప్పు ఉంటే.. రేవంత్ పాలనలో అది రూ.26,875 కోట్లకు చేరిందన్నారు. ఇప్పుడు అప్పుకోసం సీఎం రేవంత్ తమను బెదిరించే స్థాయికి వచ్చారన్నారు. సింగరేణిలో నాణ్యమైన బొగ్గు లేదని చెప్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమైన విషయంగా పరిగణించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తాడిచర్ల-2 ద్వారా సింగరేణికి చాలా లాభం చేకూరుతుందని స్పష్టం చేశారు.

Next Story