- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తూతూ మంత్రంగా ప్రజావాణి.. ముగ్గురు అధికారులతోనే ముగిసిన కార్యక్రమం
ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం నిజాంసాగర్ మండలంలో సోమవారం తూతూ మంత్రంగా సాగింది.

దిశ,నిజాంసాగర్: ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం నిజాంసాగర్ మండలంలో సోమవారం తూతూ మంత్రంగా సాగింది. మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేవలం ముగ్గురు అధికారులు మాత్రమే హాజరుకావడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ప్రజావాణి కార్యక్రమానికి తహసీల్దార్ సాయి భుజంగరావు, ఎంపీడీవో శివకృష్ణ, ఎంఈవో తిరుపతిరెడ్డి మాత్రమే హాజరయ్యారు. మిగిలిన శాఖలకు చెందిన అధికారులు గైర్హాజరయ్యారు. ముఖ్యంగా ప్రస్తుతం వానాకాలం పంటల సాగు జోరుగా కొనసాగుతున్న తరుణంలో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు కార్యక్రమానికి హాజరు కాకపోవడం విమర్శలకు తావిచ్చింది.
అదేవిధంగా ట్రాన్స్‌కో, ఉపాధి హామీ పథకం, నీటిపారుదల శాఖ(సంబంధిత శాఖ), ఐసీడీఎస్‌తో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ప్రజావాణికి హాజరుకాలేదు. దీంతో ప్రజలు తమ సమస్యలను నేరుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణి వంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై, ప్రజల వినతులను స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజావాణి కార్యక్రమం ఉద్దేశమే దెబ్బతింటుందని వారు అభిప్రాయపడ్డారు.






