ఇది పార్టీ కాదు.. ఒక విప్లవం".. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్!

by Malleboina Mahesh |

బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం! ఇది పార్టీ కాదు.. ఒక విప్లవం అంటూ కేటీఆర్ భావోద్వేగపూరిత ట్వీట్. కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు శుభాకాంక్షలు.

ఇది పార్టీ కాదు.. ఒక విప్లవం.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయ యవనికపై స్వీయ అస్తిత్వ పోరాటమే లక్ష్యంగా ఉద్భవించిన భారత రాష్ట్ర సమితి (BRS) నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలకు, అభిమానులకు ఉత్సాహాన్నిచ్చేలా సందేశాన్నిచ్చారు. "నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా" అంటూ తన ట్వీట్‌ను ప్రారంభించిన ఆయన, ఈ పాతికేళ్ల ప్రస్థానాన్ని పునరంకిత సందర్భం (Rededication) గా అభివర్ణించారు. తెలంగాణ గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడుతూ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకలకు చేరుకోవడం ఒక మహోజ్వల ఘట్టమని ఆయన పేర్కొన్నారు.

బీఆర్ఎస్ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ఒక గొప్ప విప్లవమని కేటీఆర్ స్పష్టం చేశారు. 25 ఏళ్ల ఈ లాంగ్ మార్చ్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించామని, పార్టీ ప్రస్థానంలో అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు, సోషల్ మీడియా వారియర్లకు మరియు నాయకులకు ఆయన హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అస్తిత్వ పతాకాన్ని ఎరవేసి, తెలంగాణ గొంతుకగా నిలిచిన పార్టీ ప్రయాణాన్ని స్మరించుకుంటూ.. భవిష్యత్తులోనూ అదే పట్టుదలతో ముందుకు సాగుతామని ఈ సందేశం ద్వారా కేటీఆర్ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు.

Next Story