- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు నదులు ఉన్నా.. తీరని దాహం!
ఒకవైపు కృష్ణమ్మ.. మరోవైపు తుంగభద్ర.. చుట్టూ జలకళ.

దిశ, అలంపూర్: ఒకవైపు కృష్ణమ్మ.. మరోవైపు తుంగభద్ర.. చుట్టూ జలకళ. కానీ, నడిబొడ్డున ఉన్న మానవపాడు ప్రజలకు మాత్రం తాగడానికి చుక్క నీరు దొరకని దైన్యం. వేసవి ముగిసి వర్షాలు పడుతున్నా ఇక్కడి తాగునీటి కష్టాలు మాత్రం 'రిపీట్' అవుతూనే ఉన్నాయి. చుట్టూ జీవనదులను పెట్టుకుని, రోజుకు డబ్బులు పెట్టి ప్రైవేట్ ఫిల్టర్ల దగ్గర నీళ్లు కొనుక్కోవాల్సి రావడం ఇక్కడి ప్రజల దౌర్భాగ్యమా? లేక పాలకుల, అధికారుల పరాకాష్టా? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
భగీరథ నిర్వహణ గాలికి..
మిషన్ భగీరథ ప్రారంభంలో ఆర్భాటంగా నీళ్లిచ్చిన అధికారులు ఆ తర్వాత నిర్వహణను గాలికొదిలేశారు. కృష్ణానది నుంచి సుమారు 45 గ్రామాలు దాటుకుంటూ 50 కిలోమీటర్ల దూరం నుంచి మానవపాడుకు భగీరథ నీళ్లు రావాలి. అయితే మార్గమధ్యంలో పైప్‌లైన్ల లీకేజీలు, తీవ్రమైన ప్రెజర్ లోపం కారణంగా మండల కేంద్రానికి వచ్చేసరికి నీటి చుక్క కూడా పడటం లేదు. దీనిపై స్థానిక పంచాయతీ ప్రతినిధులు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇస్తున్న.. ఫైల్ పరిశీలనలో ఉంది. పైప్‌లైన్ మారుస్తాం అనే మూస సమాధానాలతో కాలయాపన చేస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
చిన్న లాజిక్ ఎందుకు తట్టలేదు?
కృష్ణా నీళ్ల కోసం 50 కిలోమీటర్ల దూరం నుంచి పైప్‌లైన్లు వేసి ఇబ్బందులు పడటం ఎందుకు? కేవలం 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంగభద్ర నది నీటిని వాడుకుంటే సమస్య తీరుతుంది కదా! ఈ చిన్న లాజిక్ అధికారులకు ఎందుకు తట్టడం లేదు? అని మానవపాడు గ్రామస్థులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. గతంలో రాజోలి, మద్దూర్, కలుగోట్ల తాగునీటి పథకాల ద్వారా ఈ ప్రాంతానికి పుష్కలంగా తుంగభద్ర నీరు అందేది. కానీ మిషన్ భగీరథ రాకతో అధికారులు ఆ పాత స్కీములను పూర్తిగా అటకెక్కించారు. ఇప్పుడు అటు భగీరథ నీళ్లు రాక, ఇటు పాత స్కీములు పనిచేయక మానవపాడు జనం నలిగిపోతున్నారు.
ఇప్పుడే ఇలా ఉంటే.. రేపెలా?
వర్షాకాలం ప్రారంభంలోనే తాగునీటి కోసం ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను, ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తుంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఏసీ రూముల నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక ప్యాచ్ వర్క్‌లు పక్కనబెట్టి తుంగభద్ర తాగునీటి స్కీమ్‌లను యుద్ధప్రాతిపదికన ‘పునరుద్ధరించాలి. నడిగడ్డ దాహార్తిని తీర్చకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు.






