- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుస్నాబాద్‌లో దొంగల బీభత్సం.. భారీగా నగదు, బంగారం అపహరణ?
హుస్నాబాద్ పట్టణంలో నిన్న అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.

దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలో నిన్న అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో.. అది పోలీస్ స్టేషన్ వెనకాలే ఉన్న మెయిన్ రోడ్‌లో గల ఆరు దుకాణాలను లక్ష్యంగా చేసుకుని భారీగా నగదు, బంగారం, విలువైన వస్తువులను అపహరించుకుపోయారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్‌కు అత్యంత సమీపంలోనే ఈ వరుస దొంగతనాలు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇక్కడ చోరీకి గురైన అన్ని దుకాణాలకు ముందు భాగంలో షాపు, వెనకాలే ఇల్లు ఉన్నాయి. నిన్న రాత్రి వ్యాపారులు దుకాణాలు మూసివేసి, వెనకాల ఇళ్లలో నిద్రిస్తున్న సమయాన్ని దుండగులు ఆసరాగా చేసుకున్నారు. అయితే, దొంగలు ముందు వైపు ప్రధాన తాళాలు ఏవీ పగలగొట్టకపోవడంతో.. దుండగులు తొలుత భవనంపైకి ఎక్కి, బిల్డింగ్‌ల పైన మధ్యలో గల మెట్ల ద్వారా కిందికి దిగి లోపలికి చొరబడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.
ఈ అంతర్గత మెట్ల మార్గం గుండానే ఒకదాని తర్వాత ఒకటిగా ఆరు దుకాణాల్లోకి, వాటి వెనుక ఉన్న ఇళ్లలోకి దొంగలు ప్రవేశించి ఉంటారని భావిస్తున్నారు. లోపలికి చొరబడిన దుండగులు ప్రతి షాపులో అందిన కాడికి నగదును పూర్తిగా ఊడ్చేశారు. అనంతరం వెనుక వైపు ఇళ్లలోని బీరువాలను పగలగొట్టి అందులోని సొమ్మును దోచుకున్నారు. అందిన సమాచారం ప్రకారం.. మొదటి ఇంట్లో సుమారు 18 తులాల బంగారం, ₹30,000 నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే రెండవ ఇంట్లో పావు తులం బంగారం, ₹10,000 నగదు, మరియు మూడవ ఇంట్లో ₹12,000 నగదును అపహరించుకుపోయారు. మిగతా ఇళ్లు, దుకాణాల్లో పోయిన పూర్తి ఆభరణాలు, నగదు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చోరీ క్రమంలో దుండగులు బీరువాలోని దుస్తులు, పత్రాలను నేలపై పడేసి, వంటింట్లోకి సైతం చొరబడి అక్కడి వస్తువులను, సామాగ్రిని చెల్లాచెదురు చేశారు. ఉదయం నిద్ర లేచి చూసేసరికి కౌంటర్లలోని నగదు, బీరువాలోని బంగారం, వెండి మాయమవడం చూసి బాధితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్ స్టేషన్ వెనకాలేనా? వ్యాపారుల ఆవేదన..
శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీస్ స్టేషన్ వెనకాలే, తాము వెనుక గదుల్లో నిద్రిస్తున్న సమయంలోనే దొంగలు ఇంతటి సాహసానికి ఒడిగట్టడంపై వ్యాపార వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దొంగలకు పోలీసులంటే భయం లేకుండా పోయిందని, రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగలు ఏ మార్గం ద్వారా లోపలికి వచ్చారనే కోణంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఘటన జరగడాన్ని సవాల్‌గా తీసుకున్న పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.






