- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొరల రూపంలో ఉన్న దొంగలు
బీఆర్ఎస్ పై షాద్ నగర్ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు.

దిశ, షాద్ నగర్: బీఆర్ఎస్ పై షాద్ నగర్ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడారు. ప్రజలు తిరస్కరించినా బీఆర్ఎస్ నాయకులు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని, అధికారం కోల్పోయిన అక్కసుతో ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం సుమారు 8 లక్షల కోట్లకు పైగా అప్పులు భారం మోపి, వేల కోట్ల రూపాయల బకాయిలను మిగిల్చిందని అన్నారు.
డిస్కమ్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, సివిల్ సప్లై, సీడ్ కార్పొరేషన్, ఆర్టీసీ, సర్పంచ్ల బిల్లులు, కాంట్రాక్టర్ల బకాయిలు, హౌసింగ్ కార్పొరేషన్, బతుకమ్మ చీరలు, మిడ్‌డే మీల్స్ వంటి అనేక రంగాల్లో భారీ బకాయిలు పెట్టి వెళ్లారని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రైతు కుటుంబం నుంచి వచ్చిన ప్రజానాయకుడని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ ఆర్థిక అక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజల ముందుంచారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం, మద్యం, ఇసుక, ధరణి, గొర్రెల పంపిణీ, భూదోపిడీ వంటి అనేక స్కామ్‌లు జరిగాయని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూములను కొందరికి కట్టబెట్టారని, ప్రభుత్వ ఆస్తులను తక్కువ ధరలకు అప్పగించారని విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల లీజుకు ఇచ్చి దొరలమని చెప్పుకునే వారు అసలు దొరలు కాదని, దొరల రూపంలో ఉన్న దొంగలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజల సంపదను దోచుకున్న వారే ఇప్పుడు నీతి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు దూరంగా ఉందని, చట్టం తనపని తాను చేసుకుంటుందని స్పష్టం చేశారు. అవినీతి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జైలుకు వెళ్లాల్సిన సమయం వస్తే ఎవరిని వదిలిపెట్టరని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు తగిన బుద్ధి చెప్పారని, రాబోయే ఎన్నికల్లో కూడా అదే తీర్పు పునరావృతమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి, ప్రజాపాలన కొనసాగుతుండటాన్ని చూసి బీఆర్ఎస్ జీర్ణించుకోలేక అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చివరగా, తెలంగాణ అభివృద్ధికి ప్రతిపక్షం సహకరించాలని, తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలకు స్వస్తి చెప్పాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో కేశంపేట మాజీ జెడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాయక్, బాబర్ అలీ ఖాన్, సుదర్శన్ గౌడ్, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.






