Donald Trump: క్రిప్టో కంపెనీలతో ట్రంప్‌నకు 1.4 బిలియన్ డాలర్ల ఆదాయం

by S Gopi |

అమెరికాను ప్రపంచ క్రిప్టో రాజధానిగా మారుస్తానని ప్రకటించిన ట్రంప్, స్వయంగా క్రిప్టోకరెన్సీ ద్వారానే భారీగా ఆర్జించారు.

Donald Trump: క్రిప్టో కంపెనీలతో ట్రంప్‌నకు 1.4 బిలియన్ డాలర్ల ఆదాయం
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన మొదటి ఏడాదిలోనే ఆయన సంపాదన సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రభుత్వ ఎథిస్ ఆఫీస్(ఓజీఈ)కు ట్రంప్ సమర్పించిన 927 పేజీల భారీ ఆర్థిక నివేదిక దీనికి అద్దం పడుతోంది. గతంలో బరాక్ ఒబామా, జో బైడెన్ వంటి అధ్యక్షులు కేవలం 8 నుంచి 11 పేజీల నివేదికలు ఇవ్వగా, ట్రంప్ నివేదిక ఏకంగా వెయ్యి పేజీలకు దగ్గరగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అమెరికాను ప్రపంచ క్రిప్టో రాజధానిగా మారుస్తానని ప్రకటించిన ట్రంప్, స్వయంగా క్రిప్టోకరెన్సీ ద్వారానే భారీగా ఆర్జించారు. కేవలం ఒకే ఒక్క 'మీమ్ కాయిన్' లైసెన్సింగ్ ఒప్పందం ద్వారా ఆయన 635 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 5,300 కోట్లు) పైగా సంపాదించారు. దీనికి తోడు ఇతర క్రిప్టో టోకెన్లు, తన కుటుంబానికి చెందిన ‘వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్’ ఈక్విటీ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంతో కలిపి.. ట్రంప్ మొత్తం క్రిప్టో ఆస్తుల విలువ ఏకంగా 1.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 13.30 వేల కోట్లు) మార్కును దాటేసింది. ప్రస్తుతం ఫోర్బ్స్ అంచనా ప్రకారం ట్రంప్ మొత్తం నికర ఆస్తి విలువ 6 బిలియన్ డాలర్లు కాగా, బ్లూమ్‌బెర్గ్ దీనిని 7.6 బిలియన్ డాలర్లుగా పేర్కొంది.

సాధారణంగా అధ్యక్ష పదవిలో ఉన్నవారు అధికారాన్ని సొంత ప్రయోజనాలకు వాడుకున్నారనే ఆరోపణలు రాకుండా తమ వ్యాపారాలను థర్డ్ పార్టీలకు అప్పగిస్తారు, కానీ ట్రంప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని చేతుల్లోనే ఉంచుకుని కొత్త ట్రెండ్ సృష్టించారు. ఈ నివేదిక ప్రకారం ట్రంప్ కేవలం క్రిప్టో పైనే కాకుండా, వలసదారులను నిర్బంధించే ‘జీఈఓ గ్రూప్’ అనే ప్రైవేట్ జైలు సంస్థ షేర్లలోనూ పెట్టుబడులు పెట్టారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే ఈ షేర్ల కొనుగోళ్లు జరగడం, దేశంలో వలసదారుల నిర్బంధం పెరిగే కొద్దీ ఈ పెట్టుబడుల విలువ 4,45,000 డాలర్ల వరకు పెరగడం గమనార్హం. వ్యాపారాలతో పాటు, ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ తన డాక్యుమెంటరీ లైసెన్స్ ద్వారా 10 మిలియన్ డాలర్లు ఆర్జించగా.. గూగుల్ (సుందర్ పిచాయ్), మెటా, ఏబీసీ వంటి దిగ్గజ మీడియా సంస్థలతో జరిగిన చట్టపరమైన వివాదాల సెటిల్‌మెంట్ల ద్వారా వచ్చిన 80 మిలియన్ డాలర్ల నిధులు ‘ట్రంప్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ ఫౌండేషన్’కు చేరాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 20 లేదా 21వ శతాబ్దంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఈ స్థాయిలో ఇన్ని విభిన్న వ్యాపారాలలో తలదూర్చిన దాఖలాలు లేవు. వైట్ హౌస్ దీనిపై స్పందిస్తూ, ట్రంప్ కానీ ఆయన కుటుంబం కానీ ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, అంతా పారదర్శకంగానే జరిగిందని స్పష్టం చేసింది.

Next Story