నాలుగు కమిషనరేట్లకు కొత్త హద్దులు.. సీవీ ఆనంద్ కీలక నిర్ణయం

by Ramesh Naini |

హైదరాబాద్‌ పరిధిలోని నాలుగు ప్రధాన పోలీస్ కమిషనరేట్లలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పోలీస్‌ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది.

నాలుగు కమిషనరేట్లకు కొత్త హద్దులు.. సీవీ ఆనంద్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ పరిధిలోని నాలుగు ప్రధాన పోలీస్ కమిషనరేట్లలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పోలీస్‌ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలులో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ.. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి, ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్ల పరిధిలో స్టేషన్ల హద్దులు, పరిపాలనా పరమైన అంశాలపై గురువారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఉన్న వివాదాలను పరిష్కరించి, తుది ప్రతిపాదనలను ఖరారు చేశారు.

గందరగోళానికి తెర..

పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణపై గత డిసెంబర్ నెలాఖరులో జీవో విడుదలైనప్పటికీ, కొన్ని అంశాల్లో స్పష్టత లేకపోవడంతో కమిషనరేట్‌ల మధ్య గందరగోళం నెలకొంది. దీనివల్ల కేసుల నమోదు, పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆయా కమిషనర్లు సమర్పించిన ప్రతిపాదనలను డీజీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. మున్సిపల్ సంస్థలు, రెవెన్యూ విభాగాలు, న్యాయస్థానాల పరిధిని దృష్టిలో ఉంచుకుని స్టేషన్‌ల హద్దులను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో నగరం విస్తరించే తీరును, జనాభా పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.

సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలి

సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ‘పోలీస్‌ స్టేషన్ల పునర్విభజన వల్ల ప్రజలకు, న్యాయ వ్యవస్థకు, ఇతర ప్రభుత్వ విభాగాలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలి. సమర్థవంతమైన, ప్రజా కేంద్రీకృత పోలీసింగ్‌ను బలోపేతం చేయడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం’ అని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో స్టేషన్ల పరిధులపై తలెత్తిన వివాదాలను ఆయన ఈ సందర్భంగా పరిష్కరించి, వాటిని తుది ప్రతిపాదనల్లో చేర్చారు. ఈ సమీక్షా సమావేశంలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి, సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి, మల్కాజిగిరి సీపీ సుమతి పాల్గొన్నారు. వీరితో పాటు జాయింట్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story