- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'షెడ్ల' జోరు.. అడిగేదెవరు ?
నార్సింగి సర్కిల్ పరిధిలోని వట్టినాగులపల్లి గ్రామంలో అక్రమ షెడ్ల నిర్మాణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

దిశ, గండిపేట : నార్సింగి సర్కిల్ పరిధిలోని వట్టినాగులపల్లి గ్రామంలో అక్రమ షెడ్ల నిర్మాణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఖాళీ స్థలాలు, రోడ్ల వెంట ఎలాంటి అనుమతులు లేకుండానే అడ్డగోలుగా షెడ్లు నిర్మిస్తున్నప్పటికీ, వాటిని అడ్డుకోవాల్సిన మున్సిపల్ అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ అక్రమార్కుల పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వట్టినాగులపల్లి గ్రామం మొత్తం 111 జీవో పరిధిలో ఉంది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ, అవి ఏమాత్రం అమలు కావడం లేదు. అడిగిన మొత్తంలో సొమ్ములు ముట్టజెబితే టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణ దారులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్రమార్కులు ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.
కాగితాలకే పరిమితమైన 111 జీవో..
ప్రత్యేకించి 111 జీవో పరిధిలో నిర్మాణాలకు కఠిన నిబంధనలు అమలులో ఉండాల్సి ఉన్నప్పటికీ, వాటిని పూర్తిగా బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా షెడ్లు నిర్మిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాల పై ఫిర్యాదులు వచ్చినా అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టడం లేదని, చేపట్టినా చర్యలు మాత్రం కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు వస్తే మున్సిపల్ అధికారులకు పండుగ అనే చందంగా మారిందని, ఎలాంటి చర్యలు తీసుకోకపోగా మరింత డబ్బులు డిమాండ్ చేస్తూ జేబులు నింపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నేతల అండదండలు..
అక్రమ నిర్మాణాల వెనుక కొందరు రాజకీయ నాయకులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ, అధికారులతో కుమ్మక్కై వ్యవహారం నడిపిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాల ద్వారా భారీ మొత్తంలో లావాదేవీలు జరుగుతున్నాయనే ప్రచారం స్థానికంగా సాగుతోంది. ఇటీవల ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు రూటు మార్చారని, ప్రత్యక్షంగా మామూళ్ల వ్యవహారాల్లో తలదూర్చకుండా తమకు రిస్క్ లేకుండా నేతల ద్వారా డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రతి షెడ్డు నిర్మాణం వెనుక ఓ నేత ఉండడం గమనార్హం. వట్టినాగులపల్లి గ్రామ సమీపంలో సర్వీస్ రోడ్డుకు ఆనుకుని సుమారు ఎకరానికి పైగా కమర్షియల్ షెడ్లు నిర్మించారు. ఈ వ్యవహారాన్ని ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న ఓ కీలక నేత చక్కదిద్దారనే ప్రచారం ఉంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా షెడ్ల నిర్మాణం కొనసాగుతుండటంతో భవిష్యత్తులో పట్టణ ప్రణాళికకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అంతా తెలుసు..
నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించే టౌన్ ప్లానింగ్ విభాగంలోని చైన్‌మెన్‌లకు అక్రమ నిర్మాణాల విషయంలో పూర్తి వివరాలు తెలిసినప్పటికీ, ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అంతా మేనేజ్ అనే వ్యవహారంగానే సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వట్టినాగులపల్లి గ్రామంలో సుమారు 50 షెడ్లు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మించడం టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుకు అద్దం పడుతోందని అంటున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం.. ప్రసీద, టౌన్ ప్లానింగ్ ఏసీపీ, నార్సింగి సర్కిల్
నేను ఇటీవలే ఇక్కడికి బదిలీ పై వచ్చాను. వట్టినాగులపల్లి గ్రామంలో నిర్మాణం చేపట్టిన షెడ్ల విషయం నాకు తెలియదు. వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటాం. అనుమతి లేని షెడ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం.






