హుజూరాబాద్‌లో బరితెగించిన దొంగలు.. దర్జాగా బైక్ చోరీ

by Jakkula.Mamatha |

హుజూరాబాద్ పట్టణంలో దొంగలు పగటిపూటే బరితెగించారు.

హుజూరాబాద్‌లో బరితెగించిన దొంగలు.. దర్జాగా బైక్ చోరీ
X

దిశ,​హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ పట్టణంలో దొంగలు పగటిపూటే బరితెగించారు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ప్రధాన కూడలి లోనే దర్జాగా ద్విచక్ర వాహనాన్ని అపహరించుకుని వెళ్లారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ​ఘటన వివరాల్లోకి వెళితే.. ​హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల 'ఏ టు జెడ్' మెడికల్ షాప్ యజమాని నాగరాజ్ శనివారం తన బైక్‌పై షాపునకు వచ్చారు. లోపల కస్టమర్లకు మందులు ఇచ్చే క్రమంలో, తిరిగి వెంటనే బయటకు వెళ్లాల్సి ఉండటంతో ఆయన తన స్ప్లెండర్ ప్లస్ బైక్(ఏపీ 15 AR 3962) తాళాన్ని బండికే ఉంచేశారు. ఆ తర్వాత షాప్ సిబ్బందికి పనులు అప్పగించి, కొద్దిసేపటికే బయటకు వచ్చి చూడగా బైక్ కనిపించలేదు.

​సీసీటీవీలో దొంగతనం దృశ్యాలు రికార్డ్..

​బైక్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన యజమాని.. వెంటనే షాపు ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు యువకులు ఒకే బైక్‌పై వచ్చి, అందులో ఒకరు కిందికి దిగి నిమిషాల వ్యవధిలో నాగరాజ్ బైక్‌ను స్టార్ట్ చేసుకుని పరారైనట్లు సీసీ విజువల్స్ ద్వారా స్పష్టమైంది. ​"నిత్యం జనం తిరిగే అంబేద్కర్ చౌరస్తా లాంటి రద్దీ ప్రాంతంలో, అది మెడికల్ షాప్ ముందే ఇంత దర్జాగా బైక్ దొంగిలించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది." అని ​బాధితుడు నాగరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Next Story