కోట్లు కుమ్మరించారు.. ఖాళీగా వదిలేశారు!

by Jakkula.Mamatha |

ఖమ్మంలో అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది.

కోట్లు కుమ్మరించారు.. ఖాళీగా వదిలేశారు!
X

ఖమ్మం నగరంలోని 9వ డివిజన్ పరిధిలోని రోటరీ నగర్‌లో రూ.50లక్షలతో నిర్మించిన వీధి వ్యాపారుల ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. నగరంలోని వీడీవోస్ కాలనీలో సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ ఆధునిక మార్కెట్‌ నడవక మూత పడింది. ఈ పరిస్థితిని చూసినప్పటికీ ఇల్లందు రోడ్‌లో ఖానాపురం సమీపంలో రూ.4.50కోట్ల వ్యయంతో మరో సమీకృత ఆధునిక మార్కెట్ నిర్మాణం చేపట్టగా, కొంత పూర్తి చేసినా మరిన్ని నిధులు కావాలని నిర్మాణం నిలిపివేశారు. కొందరు అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదనే విమర్శలు వస్తున్నాయి.

దిశ, ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మంలో అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. అప్పట్లో అధికారంలో ఉన్నవారు కూడా తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకు సహకరించడంతో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు పలు దృష్టాంతాలు కండ్ల ముందు కనపడుతున్నాయి.

రూ.50 లక్షల వ్యయంతో నిర్మించినా..

ఖమ్మం నగరంలోని 9వ డివిజన్ పరిధిలోని రోటరీ నగర్‌లో వీధి వ్యాపారుల కోసం ఒక ప్రాంగాణాన్ని నిర్మించారు. ఈ నిర్మాణం కోసం ఏకంగా రూ.50లక్షలు ఖర్చు చేశారు. రోటరీ నగర్ రద్దీ ప్రాంతం కావడంతో కూరగాయల వ్యాపారాలు బాగా సాగుతాయని అధికారులు భావించారు. వీధి వ్యాపారుల ప్రాంగణంలో వ్యాపారస్తులకు దుకాణాలు కేటాయించారు. ఇక్కడ ఉత్సాహంగా వ్యాపారం ప్రారంభించిన వ్యాపారులు తర్వాత కొనుగోళ్లు మందగించడంతో ఒక్కొక్కరుగా తమ దుకాణాలను మూసివేశారు. వీధి వ్యాపారులు అందరు వెళ్లిపోవడంతో రూ.50లక్షలు ఖర్చుతో ఏర్పాటు చేసిన ప్రాంగణం ప్రస్తుతం ఖాళీగా ఉంది. లక్షల రూపాయలు వృధా అయ్యాయి. ఖాళీగా ఉన్న ఈ ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.

రూ. 4.50 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణం..

ఖమ్మం నగరంలోని వీడివోస్ కాలనీలో సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ ఆధునిక మార్కెట్‌ను నిర్మించారు. ఇక్కడ నాన్ వెజ్ మార్కెట్ నడవక మూత పడింది ఈ పరిస్థితిని చూసినప్పటికీ ఇల్లందు రోడ్‌లో ఖానాపురం సమీపంలో రూ.4.50కోట్ల వ్యయంతో మరో సమీకృత ఆధునిక మార్కెట్ నిర్మాణం చేపట్టారు. కొంత నిర్మాణం పూర్తి చేసిన తర్వాత నిధులు ఇంకా ఎక్కువ కావాలని నిర్మాణాన్ని ఆఫ్ చేశారు. అది అలాగే ఉంది. కొందరి అనాలోచిత చర్యలతో ప్రజాధనం వృధా అవుతున్నదనే విమర్శలు వస్తున్నాయి.

ఇల్లందు రోడ్‌లోని సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ అంచనా వ్యయం పెరగటంతో అదనపు నిధుల మంజూరుకు ప్రభుత్వానికి లేఖ రాశామని ఇంజనీరింగ్ అధికారులు ఈఈ క్రిష్ణాలాల్ తెలిపారు. నిధులు రాగానే నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. రోటరీ నగర్‌లోని వీధి వ్యాపార మార్కెట్లో వ్యాపారాలు చేసేందుకు కూరగాయల వ్యాపారులు సుముఖంగా లేరని సదరు నిర్మాణాన్ని వేరే పనికి వినియోగిస్తామన్నారు.

Next Story