కాళేశ్వరం వైఫల్యాలపై ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు

by Batti.Sumithra |

బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.1.20 లక్షల కోట్ల ప్రజాధనాన్ని నీటిపాలు చేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు.

కాళేశ్వరం వైఫల్యాలపై ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.1.20 లక్షల కోట్ల ప్రజాధనాన్ని నీటిపాలు చేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. ఆదివారం సాయంత్రం భూపాలపల్లి శాసనసభ్యుడి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులే ఇంజినీర్లుగా వ్యవహరిస్తూ ప్రాజెక్టుల నిర్మాణంలో జోక్యం చేసుకున్నందువల్లే నేడు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు, ఇంజినీర్ల సలహాలు, సూచనల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టి రైతులకు నీరందించే చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలకు ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే విమర్శలు చేసే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు ఉంటుందని స్పష్టం చేశారు.

రూ.1.20 లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో తీవ్ర సాంకేతిక లోపాలు బయటపడినప్పటికీ, వాటిపై బాధ్యత వహించకుండా బీఆర్ఎస్ నాయకులు రాజకీయ విమర్శలకు దిగడం విచారకరమని పేర్కొన్నారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టు ఈ దుస్థితికి చేరడానికి కారణమైన వారే ఇప్పుడు ప్రజలకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో కాంక్రీట్ బ్లాకులు దెబ్బతినడం, పైపింగ్, లీకేజీలు, నిర్మాణ లోపాలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) స్పష్టమైన నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఆ నివేదికల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలు చేపడుతోందని చెప్పారు. మేడిగడ్డ వద్ద నీటిని నిల్వ చేయడం వల్ల బ్యారేజ్ భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారని మంత్రి వెల్లడించారు. అలాంటి పరిస్థితుల్లో నీటిని నిల్వ చేయకుండా ఉండటం ప్రభుత్వ బాధ్యతేనని అన్నారు. ఒకవేళ నీటిని నిల్వ చేస్తే దిగువ ప్రాంతాలైన ములుగు, ఏటూరునాగారం, భద్రాచలం ప్రాంతాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశముందని నిపుణుల నివేదికలు పేర్కొన్నాయని వివరించారు.

జూలై 14, 2025న కన్నెపల్లి పంప్‌హౌస్ మునిగిపోయిందని, సుమారు రూ.680 కోట్ల విలువైన పంపులు, మరో రూ.150 కోట్ల విలువైన పరికరాలు నీటమునిగాయని మంత్రి గుర్తుచేశారు. అన్నారం పంప్‌హౌస్ కూడా నీటమునిగిందని, ఇవన్నీ ప్రాజెక్టు రూపకల్పనలో జరిగిన లోపాలకు నిదర్శనమని పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద నీటి నిల్వలు లేకపోయినా పంపులను ఆన్ చేయవచ్చని కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని మంత్రి అన్నారు. ఇంజినీర్లకంటే తమకే ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు. ప్రభుత్వం ఎలాంటి రాజకీయ ఉద్దేశంతో కాకుండా నిపుణుల నివేదికలు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకే చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నమే బీఆర్ఎస్ చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాలకు సమాధానం చెప్పాల్సింది బీఆర్ఎస్ నాయకత్వమేనని, వాస్తవాలను ప్రజలకు వివరించి క్షమాపణ చెప్పిన తర్వాతే విమర్శలు చేసే నైతిక హక్కు వారికి ఉంటుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story