బతికుండగానే చంపేశారు.. భూమి కాజేశారు!?

by Jakkula.Mamatha |

శాలిగౌరారం మండలం పెర్కొకొండారం గ్రామానికి మర్రెడ్డి సోమిరెడ్డికి 91 సంవత్సరాలు.

బతికుండగానే చంపేశారు.. భూమి కాజేశారు!?
X

దిశ, నల్లగొండ బ్యూరో: శాలిగౌరారం మండలం పెర్కొకొండారం గ్రామానికి మర్రెడ్డి సోమిరెడ్డికి 91 సంవత్సరాలు. రెవెన్యూ అధికారులు బతికుండగానే చంపేశారు. భూమిని కాజేశారు. తన భూమిని అక్రమంగా ఫోర్జరీ సంతకాలతో పట్టా చేయించుకున్నారని దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని గత కొంత కాలంగా మండల, డివిజన్ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినా రెవెన్యూ అధికారులలో చలనం లేదు. పట్టా మార్పిడి ఎలా జరిగిందో వివరాలు ఇవ్వాలని సమాచారం హక్కు చట్టం ప్రకారం అడిగితే దానికీ విలువ లేదు. ఒకవైపు తన సొంత కొడుకులు భూమి తీసుకుని, పోషణ కూడా చూడకుండా ఇబ్బందులకు గురిచేస్తుంటే అధికారులు న్యాయం చేయకుండా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు.

వాస్తవం ఏం జరిగిందంటే....

శాలిగౌరారం మండలం పెర్కొకొండారం గ్రామానికి మర్రెడ్డి సోమిరెడ్డి తండ్రి వెంకట్ రెడ్డి తన సొంత కష్టంతో దాదాపు 20 ఎకరాల వ్యవసాయ భూమిని 40 ఏళ్ల క్రితం కొనుగోలు చేశారు. అందులో దాదాపు 10 ఎకరాల భూమిని తన భార్య అయిన వెంకటనర్సమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. మిగతా మిగతా 9.28 ఎకరాల భూమిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే తన భార్య పేరుతో ఉన్న 10 ఎకరాల భూమిని తన పెద్ద కొడుకు తల్లిని బుజ్జగించి సంతకం చేయించి విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే 9.28 ఎకరాల భూమిని తన మరో కుమారుడు, కోడలు కలిసి తన సంతకాన్ని ఫోర్జరీ సంతకం చేసి దాదాపు 18ఏళ్ల క్రితమే దొంగ పట్టా చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. దొంగ పట్టా చేసుకున్న అంశంపై విచారణ చేయాలని అధికారుల వద్దకు చాలా కాలంగా తిరుగుతున్నారు. అయినా విచారణ కాదు కదా కనీసం బాధితుడి ఆవేదనను కూడా సరిగ్గా వినే ఓపిక లేకుండా పోయింది.

పట్టాదారుడు మరణించారని సాకు చూపి..

ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుదారులు , పాసు పుస్తకాల చట్టం 1971 శాలి గౌరారం భూమి పట్టా మార్పిడి చేసినట్లు అధికారులు తమ లేఖలలో పేర్కొన్నారు. పట్టాదారుడు మరణించిన తర్వాత వారసులకు పట్టా మార్పిడి జరగకపోతే వాటన్నింటిని విచారణ చేసి , వారసులు దరఖాస్తు చేసుకోలేకపోయిన రెవెన్యూ అధికారులే స్వయంగా విచారణ చేసి మర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి , భార్య అనిత పేరుతో పట్టా మార్పిడి చేసినట్లు నాటి రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. కానీ వాస్తవంగా సంబంధిత వాస్తవ పట్టాదారుడు రాజశేఖర్ రెడ్డి తండ్రి సోమిరెడ్డి (91) ఇప్పటికి జీవించి ఉన్నారు. జీవించి ఉన్న మనిషిని రెవెన్యూ అధికారులే చంపేసీ కాసులకు కక్కుర్తి శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా వ్యవహరించి దొంగతనంగా పట్టా మార్పిడి చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

దొంగ పట్టా పై విచారణకు ఫిర్యాదు చేస్తే..

తన 9-28 ఏకరాల భూమి తన కుమారుడే స్వయంగా దొంగ తనంగా పట్టా చేసుకున్నారని జిల్లా కలెక్టర్ కు 19-11-2025న (ఫిర్యాదు సంఖ్య.. ఎన్ఎల్‌జీడీసీ /ఈ/2025/07086) ఫిర్యాదు చేశారు. అయితే మండల రెవెన్యూ అధికారులేమో మర్రెడ్డి సోమిరెడ్డి మరిణించారని, అందుకే వారసుల పేరు మీదకి తన భూమిని పట్టా మార్పిడి చేస్తున్నట్లు సుమారు 18ఏళ్ల క్రితం ఆదేశాలు జారీచేశారు. ఇపుడేమో నల్లగొండ డివిజనల్ రెవెన్యూ అధికారి మాత్రం సోమిరెడ్డికి తన ఇద్దరు కుమారులు రంగారెడ్డి , రాజశేఖర్ రెడ్డి లు రూ.2వేల చొపున ప్రతినెల పోషణ కోసం ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేశారు. సుమారు 18 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి కి ఇప్పుడు పోషణ కోసం రూ. 2 వేలు ఇవ్వాలని ఎలా ఉత్తర్వులు జారీ చేశారో రెవెన్యూ అధికారులకే తెలియాలి. ఇదిలా ఉంటే రెవెన్యూ అధికారులు మాత్రం అక్రమ పట్టాపై కనీస విచారణ చేయక పోవడం దారుణం. అయితే అక్రమ పట్టా చేయించుకున్న వ్యక్తికి జిల్లా రెవెన్యూ శాఖలో పనిచేసే ఓ కీలక అధికారితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. అందుకే భూ అక్రమాలపై విచారణ జరగకుండా అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా 91 ఏళ్ల వయసులో ఉన్న ఆ పెద్దాయనతో ‘‘ నీ దగ్గర నోట్ల కట్టలు మూటలు కట్టి ఉన్నాయట కదా.. నీకు భూమి ఎందుకు ‘‘ అంటూ వెటకారంగా మాట్లడారని సమాచారం.

ఆర్టీఐకి స్పందించని రెవెన్యూ అధికారులు..

పెర్కకొండారం గ్రామంలో తన వ్యవసాయ భూమి మారెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు మీదకి ఎలా పట్టా మార్పిడి జరిగిందో పూర్తి వివరాలతో కూడిన డాక్యుమెంట్ లు ఇవ్వాలని 2026 మే 3వ తేదిన శాలిగౌరారం మండల రెవెన్యూ అధికారికి సోమిరెడ్డి ధరఖాస్తు చేశారు. కానీ దానికి ఇంత వరకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఆ సీనియర్ సిటిజన్ ను మానసికంగా వేధిస్తున్నారు. ‘చట్టం గిట్టం జన్తా నై..’ దిక్కున్న చోట చెప్పుకోమంటు అధికారులు అతనిని బెదిరింపులకు గురి చేస్తున్నారని సమాచారం,

అక్రమ పట్టా పై విచారణ జరగాల్సిందే: మర్రెడ్డి సోమిరెడ్డి ,పెర్క కొండారం, శాలిగౌరారం

నా భూమి నా పేరు నుంచి ఇతరుల పేరు మీదికి పట్టా మార్పిడి ఎలా జరిగిందో విచారణ చేయాలి. దానికి కారణమైన అధికారులను శిక్షించాలి. నా పేరుతో తిరిగి పట్టా చేయాల్సిందే. అలా కాకుండా కొడుకులు నెలకు కొంత డబ్బులు ఇస్తారు తీసుకోమని ఆర్డీవో ఆదేశాలు జారీ చేయడం నచ్చలేదు. నా ఆస్తి నాకిస్తే నేనే దర్జాగా బతుకుతా.. ఎవరి దయా దాక్షిణ్యాలు నాకు అవసరం లేదు. నేను చనిపోయానని చెప్పిన రెవెన్యూ అధికారులే ఇప్పుడు డబ్బులు తీసుకుని బతకమని చెప్పడం సిగ్గుచేటు.

Next Story