- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెళితేనే.. ఉంటారు!
వారంతా ఐదు వేల నుండి పదివేల వరకు వేతనం పొందే బడుగు జీవులు. అయినప్పటికీ చిన్న ఉద్యోగమని కుంగిపోకుండా విధులను నిర్వహించుకుంటూ పైసా పైసా పోగేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.

ఎస్సీ వెల్ఫేర్‌లో గత ఐదేళ్లుగా ఉద్యోగాన్ని నమ్ముకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వారిని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి బదిలీల పేరుతో మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో 10 మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం పని చేస్తున్న స్థానం నుంచి 40- 100కిలోమీటర్ల దూర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేయడంతో వచ్చే ఐదు, పది వేల జీతానికి అంత దూరం వెళ్లి కుటుంబాన్ని ఎలా నెట్టుకు రావాలని దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొందరు ఉద్యోగాన్ని మానేయడానికి సిద్ధపడగా, మరికొందరు ఉద్యోగం పోతుందనే భయంతో దూర ప్రాంతమైన చేసేదేమీ లేక విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న స్థానంలోనే కొనసాగించాలని వేడుకున్నా.. ప్రాధేయపడినా కనికరించడం లేదని, అనువు గాని చోటికి బదిలీ చేస్తే వారంతట వారే మానేస్తారని, అనంతరం తమ మనుషులని వారి స్థానంలో చేర్చవచ్చనే ఉద్దేశంతో ఇలా చేశారని పలువురు ఉద్యోగులు అంటున్నారు.
దిశ, కొత్తగూడెం: వారంతా ఐదు వేల నుండి పదివేల వరకు వేతనం పొందే బడుగు జీవులు. అయినప్పటికీ చిన్న ఉద్యోగమని కుంగిపోకుండా విధులను నిర్వహించుకుంటూ పైసా పైసా పోగేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. గత ఐదేళ్లుగా ఎస్సీ వెల్ఫేర్‌లో వారు నిర్వహిస్తున్న ఉద్యోగాన్ని నమ్ముకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కానీ ఆకస్మాత్తుగా జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి, బదిలీల పేరుతో మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో 10 మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
కొన్నేళ్లుగా స్థానికంగా ఉంటూ హాస్టల్ లో పని చేసుకుంటున్న వద్ద నుంచి 40 నుంచి 100 కిలోమీటర్ల దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో ఈ పది మంది ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమకు వచ్చే ఐదు, పది వేల జీతంలో దూర ప్రాంతాలకు వెళ్లి కిరాయి కట్టుకొని ఎలా కుటుంబాన్ని నెట్టుకు రావాలని తలలు పట్టుకుంటున్నారు. ఉద్యోగం మానేయడానికి ఇప్పటికే నలుగురు సిద్ధపడ్డారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఆరుగురు అధికారులు డీఎస్సీ డీఓ స్థానంలో విధులు నిర్వహించిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ఎవరికీ రాని సమస్య ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆ అధికారిణికే ఎందుకు వచ్చాయని పలు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
పదిమంది బదిలీ..
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు రూ.40వేల నుంచి మొదలుకొని లక్షల్లో ఉంటాయి. బదిలీల్లో భాగంగా వారిని దూరప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేసినా, కుటుంబంతో సహా వెళ్లి వారు నిర్వహిస్తున్న ఉద్యోగాన్ని సమర్థంగా నిర్వహిస్తూ, ఇంటి కిరాయి, పిల్లల బడి ఫీజులు, ఇంటి సామాన్లు ఇతర ప్రాంతాలకు చేర్చడం వంటి ఖర్చులను వారు భరించగలరు. కానీ ఈ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాన్ని బట్టి వారు సంపాదించే ఐదు, పదివేల జీతంతో బదిలీ చేసిన స్థానంలో పనిచేయలేక, కుటుంబాన్ని పోషించలేక సతమతమవుతున్నారు. ఇప్పటికే పది మంది ఉద్యోగులలో నలుగురు ఉద్యోగులు డ్యూటీకి వెళ్లడం మానేశారు. కొందరు ఉద్యోగం పోతుందనే భయంతో దూర ప్రాంతమైన చేసేదేమీ లేక విధులు నిర్వహిస్తున్నారు. అణువు గాని చోటికి బదిలీ చేస్తే వారంతట వారే మానేస్తారని, అనంతరం తమ మనుషులని వారి స్థానంలో చేర్చవచ్చనే ఉద్దేశంతో ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తాము ఏమి తప్పు చేయలేదని, తాము ఉద్యోగాలు చేస్తున్న హాస్టల్లోనే తమని ఉండనీయాలంటూ కన్నీటి పర్యంతమైన.. ప్రాధేయపడినా కనికరించడం లేదంటూ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర మనోవేదన లో ఉన్నారు.
మౌఖిక బదిలీల పేరుతో వేధింపులు..
బదిలీ అయిన పదిమంది అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏజెన్సీల కింద పని చేస్తున్నారు. ప్రభుత్వం సంబంధిత శాఖ ద్వారా ఏజెన్సీలకు వేతనాల కోసం నగదు చెల్లిస్తారు. సదరు ఏజెన్సీలు వారి కింద పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తారు. ఉద్యోగులు సరిగ్గా విధులు నిర్వహించనప్పుడు ఏజెన్సీలని పిలిపించి, హెచ్చరించి వారి ద్వారా ఉద్యోగులను ట్రాన్స్‌ఫర్ చేయించడమో, స్థానచలనం కలిగించడం చేయాలి. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీఎస్సీ డీఓ మాత్రం ప్రత్యేకంగా తానే చర్యలకు పూనుకొని పదిమందిని బదిలీ చేసి, వారంతట వారే మానేసేలా మౌఖిక ఆదేశాలు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. మానేసిన వారి స్థానంలో కొత్తవారిని తీసుకునెందుకే ఇలా చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇష్టం లేకపోతే మానేయొచ్చంటూ పలుమార్లు ఉద్యోగులతో అన్నట్లు తెలుస్తోంది. అంటే ఉద్దేశపూర్వకంగానే వారిని బదిలీ చేసినట్లు తేటతెల్లమవుతుంది.
కన్నీళ్లు పెట్టుకున్నా..
కన్నీళ్లు పెట్టుకొని బతిమిలాడుకున్నా, ఇష్టముంటే చేయండి లేకపోతే మానేయండి అని కరాకండిగా జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిని పలుమార్లు అనడం ఉద్యోగులలో విస్మయానికి గురిచేస్తుంది. మణుగూరు హాస్టల్లో పనిచేస్తున్న ఓ గిరిజన మహిళను రామవరం బాయ్స్ హాస్టల్‌కు బదిలీ చేశారు. పాల్వంచ గర్ల్స్ హాస్టల్ లో పనిచేస్తున్న ఒక మహిళను పోస్టుమట్రిక్, ప్రీమెట్రిక్ బాయ్స్ హాస్టల్‌కు వాచ్మెన్‌గా నియమించారు. మహిళగా తాను కళాశాల విద్యార్థులు చదువుతున్న బాయ్స్ హాస్టల్‌లో పని చేయలేనని మొర పెట్టుకున్నా మేడమ్ వినడం లేదంటూ సదురు మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. బూర్గంపాడు బాయ్స్ హాస్టల్ లో పనిచేస్తున్న మహిళా కుక్‌ను ఇల్లెందు బాయ్స్ హాస్టల్‌కు వెళ్లాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
చంద్రుగొండలో బాయ్స్ హాస్టల్‌లో పనిచేస్తున్న వాచ్మెన్‌ను ములకలపల్లికి బదిలీ చేశారు. ప్రస్తుతం చంద్రుగొండలో వాచ్మెన్ లేనప్పటికీ కచ్చితంగా ములకలపల్లికి వెళ్లాల్సిందే అని హుకుం జారీ చేశారు. చుంచుపల్లి ప్రీ మెట్రిక్ హాస్టల్‌లో పనిచేస్తున్న ఉద్యోగినిని పాల్వంచకి బదిలీ చేశారు. ఇలా ఒకచోట పని చేస్తున్న వారిని మరోచోటికి కారణం లేకుండా బదిలీ చేసి వారిని తీవ్ర మనోవేదనకి గురయ్యేలా మౌఖిక ఆదేశాలు ఇవ్వడం పట్ల పలు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. కొత్తగూడెంలో ఇఫ్టు (ఐఎఫ్‌టీయూ) నాయకులు సమావేశం నిర్వహించి డీఎస్‌సీడీఓ పద్ధతి మార్చుకోకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
పనులు సక్రమంగా జరగాలనే బదిలీలు: డీఎస్సీ డీఓ, శ్రీలత
నాకు ఎవరి పైన కక్ష లేదు. హాస్టల్లో పనులు సక్రమంగా జరగాలని ఉద్దేశంతోనే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బదిలీ చేశామని డీఎస్సీ డీవో శ్రీలత తెలిపారు. పని అవసరం ఉన్నవాళ్లు చేస్తారు. అవసరం లేని వారు మానేయవచ్చు. కొందరు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హాస్టల్స్ లోపల ఫోటోలు తీసి ఇతర వ్యక్తులకు చేరవేస్తున్నారని, ఎస్సీ వెల్ఫేర్ శాఖ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్నారని, అందుకే ఈ పదిమందిలో ఉన్న ఆ కొంత మందిని కూడా బదిలీ చేశామన్నారు.






