క్రీడా ప్రాంగణానికి పాతరేసి.. భవనానికి పునాదులేశారు!

by Jakkula.Mamatha |

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలి.. గ్రామీణ యువతకు ఆటపాటల్లో సరైన ప్రోత్సాహం అందించాలి.

క్రీడా ప్రాంగణానికి పాతరేసి.. భవనానికి పునాదులేశారు!
X

దిశ, వెంకటాపూర్,రామప్ప: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలి.. గ్రామీణ యువతకు ఆటపాటల్లో సరైన ప్రోత్సాహం అందించాలి. ఇదే ఆశయంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి శ్రమించి, నిధులు కేటాయించి ప్రతి గ్రామంలో "క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది.కానీ, ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్ర పరిధిలోని జవహర్ నగర్ గ్రామంలో మాత్రం ప్రభుత్వ ఆశయాలకు ఘోరంగా గండిపడుతోంది. పిల్లలు,యువత ఆడుకోవడానికి కేటాయించిన ఆట స్థలాన్ని కాపాడాల్సింది పోయి, ఏకంగా ఆ క్రీడా ప్రాంగణంలోనే కొత్త భవనానికి పునాదులు తీసి పిల్లర్లు లేపేస్తున్నారు!తెలంగాణ క్రీడా ప్రాంగణము అని బోర్డు స్పష్టంగా కనిపిస్తున్నా.. కళ్లముందే మైదానం కాంక్రీట్ వనంగా మారుతున్న పంచాయతీ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై ఆడుకునే స్థలం లేక యువత అల్లరి మూకలు గా మారే ప్రమాదం ఉందని, ఉన్న ఒక్క ప్రాంగణాన్ని కూడా ఇలా కాంక్రీట్ వనంగా మార్చడం ఏంటని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒకచోట తీర్మానం.. ఇంకోచోట భూమిపూజ.. చివరికి ఆట స్థలంలో భవనం!

ఈ భవన నిర్మాణ వ్యవహారంలో జరుగుతున్న అక్రమాలు, నిబంధనలు ఉల్లంఘనలు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. జవహర్ నగర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవనం నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ పాలకమండలి సమక్షంలో గ్రామ సభ నిర్వహించి ఒక నిర్దిష్ట సర్వే నంబర్‌లోని స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేసిన ప్రదేశంలోనే గత నెలలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా ముగ్గు పోసి (భూమి పూజ) పనులు ప్రారంభించారు. అయితే, ముగ్గు పోసిన కొద్ది రోజులకే అసలు కథ మారింది! గ్రామ పంచాయతీ ఆమోదించిన స్థలాన్ని, భూమి పూజ చేసిన ప్రదేశాన్ని సైతం రాత్రికి రాత్రే పక్కన పెట్టేశారు. ఎలాంటి అధికారిక పునఃపరిశీలన లేదా ప్రజాభిప్రాయం లేకుండానే.. ఏకంగా గ్రామంలో ఉన్న ఒక్కగానొక్క 'తెలంగాణ క్రీడా ప్రాంగణం' స్థలంలోకి భవనాన్ని మార్చేశారు. ప్రస్తుత క్రీడా బోర్డు వెనకాలే భవన పునాదులు తవ్వి, పిల్లర్లు నిలబెట్టడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ ధనం బూడిదలో పోసిన పన్నీరేనా?

ఈ విచిత్ర నిర్మాణం వల్ల ఒకవైపు క్రీడా ప్రాంగణం ధ్వంసమవ్వడమే కాకుండా,మరోవైపు ప్రజాధనం తీవ్రంగా వృథా అవుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొదటి నష్టం: గతంలో ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు కోసం వేలాది రూపాయలు వెచ్చించి స్థలాన్ని సమతలం చేసి, క్రీడా పరికరాలు, బోర్డును ఏర్పాటు చేసింది. ఇప్పుడు అక్కడ భవనం నిర్మించడం ద్వారా ఆ క్రీడా ప్రాంగణానికి చేసిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరైంది.

రెండో నష్టం: మహిళా సమాఖ్య భవనానికి అనుమతులు ఉన్న స్థలాన్ని వదిలేసి, రేపు చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశమున్న క్రీడా స్థలంలో నిర్మించడం వల్ల భవిష్యత్తులో ఈ భవనం కోర్టు చిక్కుల్లో పడితే ప్రజల సొమ్ము వృధా అయ్యే ప్రమాదం ఉంది. ఒకే స్థలంలో రెండు ప్రభుత్వ ప్రాజెక్టులను ఒకదానిపై ఒకటి రుద్ది, రెండింటినీ నాశనం చేయడం వెనుక ఏ సాంకేతిక అధికారి అనుమతి ఉందో చెప్పాలని గ్రామస్తులు నిలదీస్తున్నారు.

యువత భవిష్యత్తుతో ఆడుకోవద్దు!

సెలవు రోజుల్లో, సాయంత్రం వేళల్లో గ్రామీణ యువత, పాఠశాల విద్యార్థులు మానసిక ఉల్లాసం కోసం, శారీరక దృఢత్వం కోసం ఈ క్రీడా ప్రాంగణాన్ని ఉపయోగించుకునేవారు. ఇప్పుడు అక్కడ పునాదులు, పిల్లర్లు లేవడంతో పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేక వీధుల్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు క్రీడలను ప్రోత్సహిస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తూ.. మరోవైపు ఉన్న ఆట స్థలాలను భవనాల పేరుతో ఆక్రమించడం ఎంతవరకు సమంజసమని యువకులు ప్రశ్నిస్తున్నారు. మహిళా సమాఖ్య భవనం గ్రామానికి అవసరమే, కానీ దానికి కేటాయించిన స్థలంలో నిర్మించాలి తప్ప క్రీడాకారుల పొట్ట కొట్టి కాదని స్పష్టం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ తీర్మానాన్ని ధిక్కరించి, అనుమతి లేని స్థలంలో మరియు క్రీడా ప్రాంగణంలో నిర్మాణాలు చేపట్టడం పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం నేరమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విచిత్రమైన, అక్రమ నిర్మాణం పై జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీవో మరియు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని జవహర్ నగర్ గ్రామ ప్రజలు, క్రీడాభిమానులు డిమాండ్ చేస్తున్నారు. క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న అక్రమ భవన నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలి. గ్రామ పంచాయతీ మొదట తీర్మానం చేసి, ముగ్గు పోసిన అధికారిక స్థలంలోనే మహిళా సమాఖ్య భవనాన్ని నిర్మించాలి. క్రీడా ప్రాంగణాన్ని పునరుద్ధరించి గ్రామీణ క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలి. తీర్మానాన్ని ఉల్లంఘించి, క్రీడా మైదానంలో పనులు ప్రారంభించడానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే, క్రీడా ప్రాంగణం పరిరక్షణ కోసం గ్రామ యువత మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

Next Story