తెలంగాణ జాగృతికి కొత్త అధ్యక్షురాలు: అధికారికంగా ప్రకటించిన కవిత

by Gantepaka Srikanth |

తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ ఫౌండర్ కల్వకుంట్ల కవిత సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ జాగృతికి కొత్త అధ్యక్షురాలు: అధికారికంగా ప్రకటించిన కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ ఫౌండర్ కల్వకుంట్ల కవిత సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం, ఆత్మగౌరవ పరిరక్షణే ధ్యేయంగా రెండు దశాబ్దాలుగా తెలంగాణ జాగృతి పనిచేస్తోందని కవిత తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం తీవ్రరూపం దాల్చిన సమయంలో, ఈ ప్రాంత సాంస్కృతిక వైభవాన్నీ, చారిత్రక నేపథ్యాన్నీ ప్రపంచానికి పరిచయం చేసేందుకు 2006లో తెలంగాణ జాగృతిని స్థాపించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ పల్లెలకే పరిమితమైన బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో జాగృతి కీలక పాత్ర పోషించిందన్నారు. బతుకమ్మ ఉత్సవాల వేదికగా మహిళలను పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలోకి భాగస్వాములను చేయడంలో ఈ సంస్థ విశేష కృషి చేసిందని వెల్లడించారు.

గత రెండు దశాబ్దాలుగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన కల్వకుంట్ల కవిత, ఇకపై ఫౌండర్ చైర్పర్సన్‌గా కొనసాగనున్నారు. ఈ క్రమంలోనే సంస్థ కొత్త అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నూతన అధ్యక్షురాలి సారథ్యంలో తెలంగాణ జాగృతి తన లక్ష్యాల వైపు మరింత బలంగా పయనిస్తుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story