- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమాలకు 'కింగ్'.. కుత్బుల్లాపూర్ జోన్!
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు హద్దు లేకుండా విచ్చలవిడిగా సాగుతున్నాయి.

దిశ, పేట్ బషీరాబాద్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు హద్దు లేకుండా విచ్చలవిడిగా సాగుతున్నాయి. అనుమతులు ఒకటైతే.. క్షేత్రస్థాయిలో నిర్మిస్తున్నది మరొకటి. ప్రణాళిక విభాగం అధికారుల ఉదాసీనత, మామూళ్ల మత్తులో జోనల్ వ్యాప్తంగా అక్రమ కట్టడాలు ఆకాశాన్నంటుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి నిర్మిస్తున్న భవనాలపై స్థానికులు వందల సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్న అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో బాధితుల సహనం నశించింది.
వినూత్న నిరసన.. అధికారుల తీరుపై నిలదీత!
పదే పదే వినతులు ఇచ్చినా ప్రయోజనం లేకపోవడంతో విసిగిపోయిన బాధితులు సోమవారం ఏకంగా అక్రమ నిర్మాణానికి సంబంధించిన నమూనాను పట్టుకుని కుతుబుల్లాపూర్ జోనల్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. సర్కిల్ కార్యాలయం ఎదుటే ప్రదర్శనగా వచ్చి ఫిర్యాదు చేశారు. సూరారం గ్రామం, గాజులరామారం సర్కిల్ పరిధిలోని సర్వే నెంబర్ 115లో అనుమతులకు విరుద్ధంగా సాగుతున్న నిర్మాణాన్ని సీజ్ చేసి,దనపు అంతస్తులను కూల్చివేయాలని 9 మంది పౌరులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. 'స్టిల్ట్ + 2' అంతస్తులకే అనుమతి తీసుకుని, ఏకంగా 'స్టిల్ట్ + 4' అంతస్తులు లేపుతున్నారని, సెట్‌బ్యాక్‌లు కూడా వదల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సర్కిల్ కార్యాలయం ముందే ఈ తరహా పరిస్థితులు ఉన్నాయంటే.. ఇక పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఊహించుకోవచ్చని బాధితులు నిలదీశారు.
సీజ్ చేసినా ఆగని దందా.. ఆసుపత్రి కూడా!
జోనల్ కార్యాలయం పక్కనే భారీ అక్రమ కన్వెన్షన్ హాల్ నిర్మాణం జరుగుతున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ లేకపోవడం గమనార్హం. బ్యాంక్ కాలనీలో గతంలో అధికారులు సీజ్ చేసిన ఒక భవనంలో యథేచ్ఛగా నిర్మాణాలు పూర్తి చేయడమే కాకుండా, అందులో ఏకంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిని కూడా ప్రారంభించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున 'చేతులు మారాయనే' ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
'ఎస్టీఎఫ్' హామీ.. కాగితాలకే పరిమితం!
జోన్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు ఎస్టీఎఫ్ బృందాలు తీసుకున్న చర్యలు సున్నా అనే చెప్పాలి. రోజురోజుకు వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను చూస్తుంటే అధికారులు మామూళ్ల మత్తులో తూగుతూ, నిబంధనలను బుట్టదాఖలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కుతుబుల్లాపూర్ జోన్‌లో జరుగుతున్న అక్రమ కట్టడాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై, బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






