- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడ్డగోలుగా తవ్వేస్తున్నారు!
ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ కొనసాగుతోంది. దీంతో అక్రమార్కులు లక్షల రూపాయల్లో అందినకాడికి దండుకుంటున్నారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ కొనసాగుతోంది. దీంతో అక్రమార్కులు లక్షల రూపాయల్లో అందినకాడికి దండుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అధికారులు అక్రమార్కులపై చర్యలకు వెనకడుగు వేస్తున్నారు. మార్గమేదైనా సరే.. ధనార్జనే ధ్యేయంగా అడ్డగోలుగా సంపాదించే లక్ష్యంతో మొరం మాఫియా ఇష్టారీతిన రెచ్చిపోతోంది. మొరం గుట్టలు కనిపిస్తే చాలు కరెన్సీ నోట్ల గుట్టలుగా భావిస్తున్న మొరం మాఫియా గద్దలా అక్కడ వాలిపోతుంది. జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలు పెట్టి మొరం తవ్వకాలు చేపడుతూ అక్రమ రవాణా కొనసాగిస్తోంది. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే మొరం గుట్టలను, ఖనిజ సంపదను బహిరంగంగా కొల్లగొడుతున్న అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం మొద్దు నిద్ర పోతుంది.
ముడుపుల మత్తులో జోగుతూ ఏ విపత్తు జరిగితే నాకేందన్న చందంగా వ్యవహరిస్తోంది. మొరం తవ్వకాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖల అధికారులైతే మొరం తవ్వకాల నియంత్రణ మా పని కాదన్న చందంగా ప్రవర్తిస్తున్నాయనే విమర్శలున్నాయి. మరో పక్క పోలీస్ వ్యవస్థ కూడా మొరం మాఫియాపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో తమకెదురనేదే లేదన్న చందంగా మొరం గుట్టలను అక్రమంగా జేసీబీలు పెట్టి మరీ తవ్వేస్తున్నారు. మొరం మాఫియాలో 80 నుంచి 90 శాతం రాజకీయ పార్టీలతో సంబంధాలున్న వారే కావడంతో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా వారితో కుమ్మక్కై విలువైన ఖనిజ సంపదను దర్జాగా దోచేయడానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న మొరం దందా..
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ అక్రమ మొరం దందా నిరాటకంగా కొనసాగుతోంది. ఒక్క మండలమనే కాకుండా దాదాపు అన్ని మండలాల్లోనూ ఈ దందా కొనసాగుతోంది. గ్రామాల శివారులో ఉన్న నీటి కుంటలు, మొరం గుట్టలు, చెరువులోని శిఖం భూముల్లో, గుట్టల వద్ద మొరం తవ్వకాలను చేపడుతున్నారు. గ్రామాల్లోని నివాస సముదాయాలకు అతి దగ్గరలో కొనసాగుతున్న మొరం తవ్వకాల కారణంగా చాలా ప్రమాదాలేర్పడుతున్నాయి. చాలా లోతుగా మొరం తవ్వకాలు చేపడుతున్న మాఫియా తవ్వకాలు, అక్రమ రవాణా ద్వారా ఎంత పెద్ద మొత్తంలో సంపాదిస్తున్‌నామనే అంశంపైనే దృష్టి సారిస్తున్నారే తప్ప వేసవి కాలంలో తవ్విన మొరం గుంతల్లో వర్‌షాకాలం నీరు చేరి ఎందరి అమాయక ప్రాణాలు తీసే మృత్యు కుహరాలుగా మారుతున్నాయనే అంశంపై ఆలోచించడం లేదు.
మృతి చెందిన చిన్నారులతో ధర్నా..
తాజాగా భీమ్ గల్ మండలం లింబాద్రి గుట్ట ప్రాంతంలో శుక్రవారం నీటి కుంటలో ఆడుకోవడానికి వెళ్ళి గల్లంతైన ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ చిన్నారులు మృతి చెందిన కుంట మొరం తవ్వకాల కారణంగా ఏర్పడిందే. అక్రమార్కులు తవ్విన మొరం గుంతల్లో పడి తమ పిల్లలు చనిపోయారని, మొరం తవ్వకాలు జరిపిన వారిని శిక్షించాలని కుంటలో పడి చనిపోయిన చిన్నారుల బంధువులు పిల్లల మృతదేహాలను రోడ్డుపై ఉంచి ధర్నా నిర్వహించారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. గతంలో నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో ఓ ప్రముఖ బీఆర్ఎస్ నాయకుడు అక్రమంగా తవ్విన మొరం గుంతల్లో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు నీట మునిగి చనిపోయారు. ఈ సంఘటన అప్పట్లో అందరినీ కంటతడి పెట్టించింది.
సదరు నేతపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ కూడా వెల్లువెత్తాయి. కానీ, అప్పట్లో సదరు నేత అధికారంలో ఉండటంతో అధికార యంత్రాంగం ఆయన పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బోధన్, బాల్కొండ, డిచ్ , ఆర్‌మూర్ సెగ్మెంట్లలోని పలు చోట్ల కూడా గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ, ఎప్పుడూ, ఎక్కడా ఎవరిపైన చర్యలు తీసుకున్న దాఖలాలు కానీ.. అక్రమ మొరం తవ్వకాలను నియంత్రించిన దాఖలాలు కానీ లేవు. దీంతో మొరం మాఫియా మరింత రెచ్చిపోతోంది. తాము తవ్వి వదిలేసిన గుంతల్లో పడి చచ్చేది మా పిల్లలైతే కాదు కదా అనే ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వానికి దండిగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఖనిజ సంపదను కాపాడే సత్తా ఎలాగూ లేని అధికార యంత్రాంగం కనీసం విలువైన ప్రాణాల గురించి పట్టింపు లేకుండా వ్యవహరించడం శోచనీయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత మరచి వ్యవహరిస్తుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.






