- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఫైళ్లకు బ్రేక్!
శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన నూనె లహర్ష అనే ఆరు సంవత్సరాల బాలిక డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ కోసం ఆమె తండ్రి నూనె సురేష్ గత రెండు నెలలుగా ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

దిశ, హుజూరాబాద్ రూరల్: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన నూనె లహర్ష అనే ఆరు సంవత్సరాల బాలిక డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ కోసం ఆమె తండ్రి నూనె సురేష్ గత రెండు నెలలుగా ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. శంకరపట్నం మండల రెవెన్యూ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయానికి ఆమె ఫైల్ పంపించి రెండు నెలలవుతున్నా ఇప్పటివరకు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ ఆర్డీవో కార్యాలయంలో సంతకం కాలేదు. ఇది ఒక్క నూనె లహర్ష సమస్య కాదు హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల పరిధిలో ఏ ఒక్క సమస్య ఆర్డీవో కార్యాలయంలో పరిష్కారం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే హుజూరాబాద్ శివారులోని రాంపూర్, రంగాపూర్, పెద్ద పాపాయ్యపల్లె గ్రామాలకు చెందిన 70 మంది రైతుల భూమి కరీంనగర్ - వరంగల్ నేషనల్ హైవేలో కోల్పోయారు. వీరికి మొదటి దఫా డబ్బులు ప్రభుత్వం చెల్లించింది. తమకు వాల్యూవేషన్ ప్రకారం డబ్బులు రాలేదని రైతులు జిల్లా కలెక్టర్ కు అప్పీలు చేశారు. జిల్లా కలెక్టర్ వీరి అప్పీలకు సంబంధించిన డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్ ఆర్డీవో కు సిఫార్సు చేశారు. అయినప్పటికీ జనవరి నుంచి వీరు ఫైల్ పెండింగ్‌లోనే ఉంది. ఇలా కోకొల్లలుగా భూ సమస్యలు హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పెండింగ్ లోనే ఉంటున్నాయి.
సామాన్యుల పాలిట నరకకూపంగా కార్యాలయం..
హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం సామాన్యుల పాలిట నరకకూపంగా మారింది. 'ప్రజల కోసమే పాలన' అనే నినాదాలు ఇక్కడ తుంగలో తొక్కుతున్నారు. ఆఫీస్ గడప తొక్కితే ఏ ఒక్క పనీ సజావుగా సాగకపోగా ఇక్కడి అధికారుల తీరు 'అడిగేవారు లేరు.. చెప్పేవారు లేరు' అన్న చందంగా తయారైంది. చిన్నపాటి సర్టిఫికెట్ల నుంచి భూ సమస్యల పరిష్కారం వరకు ప్రతి ఒక్క ఫైలును నెలల తరబడి అటకెక్కించడంతో బాధితులు కార్యాలయం చుట్టూ తిరిగి విసిగి వేసారిపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యపు పరాకాష్టకు ఈ కార్యాలయమే సజీవ సాక్ష్యం గా నిలుస్తోంది.
పుట్టిన తేదీ సర్టిఫికెట్‌కు 'నెలల' ప్రసవ వేదన!
ఎమ్మార్వో కార్యాలయం నుంచి అన్ని రకాల విచారణలు పూర్తయి ఆఖరి ముద్ర కోసం ఆర్డీఓ ఆఫీస్‌కు చేరిన 'డేట్ అఫ్ బర్త్' (పుట్టిన తేదీ) సర్టిఫికెట్ల ఫైళ్లు ఇక్కడ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కేవలం ఒక సంతకం పెట్టి క్లియర్ చేయడానికి ఇక్కడి సాబ్ లకి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుండటం గమనార్హం. సంబంధిత సెక్షన్ సీటులో ఉండే ఉద్యోగి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు పోతాడో ఎవరికీ తెలియదు. ఒకవేళ సీటులో ఉన్నా 'రేపు రా.. మాపు రా' అంటూ బాధితుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. సర్టిఫికెట్లు సకాలంలో చేతికి అందక విద్యార్థుల భవిష్యత్, నిరుద్యోగుల ఉద్యోగావకాశాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి.
'ప్రజావాణి'ని ప్రహసనంగా మార్చేశారు..
ప్రజల కష్టాలను తక్షణమే తీరుస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన 'ప్రజావాణి' కార్యక్రమాన్ని ఇక్కడి అధికారులు పూర్తిగా అభాసుపాలు చేశారు. ప్రజావాణిలో బాధితులు కన్నీళ్లతో సమర్పించిన దరఖాస్తులను బుట్టదాఖలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్జీలు తీసుకోవడం వరకే అధికారుల బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తప్ప, వాటికి మోక్షం కలిగించే నాథుడే కరువయ్యాడు.
'భూభారతి' మారినా.. రైతుల రాత మారలేదు!
గతంలో ఉన్న ధరణి పీడ విరగడై, నూతనంగా 'భూభారతి' వ్యవస్థ అమల్లోకి వచ్చినా క్షేత్రస్థాయిలో రైతుల రాతలు మాత్రం మారడం లేదు. ఆర్డీఓ పరిధిలోకి వచ్చే ఏ ఒక్క భూ సమస్య కూడా పరిష్కారమైన దాఖలాలు లేవు. భూ సమస్యల ఫైళ్లను టేబుళ్లపైనే మురగబెడుతూ రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారుల కాలయాపన వల్ల గ్రామాల్లో భూ వివాదాలు మరింత ముదిరి శాంతిభద్రతల సమస్యలుగా మారుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితుల ఆగ్రహం.. జిల్లా కలెక్టర్ స్పందించరా?
హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో తిష్టవేసిన ఈ అవ్యవస్థపై జిల్లా కలెక్టర్ తక్షణమే కొరడా ఝుళిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విధులకు ఎసరు పెడుతూ లబ్ధిదారులను పీడిస్తున్న సెక్షన్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను యుద్ధప్రాతిపదికన క్లియర్ చేయాలని హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై ఆర్డీవో రమేష్ బాబును వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.






