గద్వాల కాంగ్రెస్‌లో ‘సొంత’ పోరు!

by Jakkula.Mamatha |

నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి నివేదిక’ బస్సు యాత్ర జిల్లాలో రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది.

గద్వాల కాంగ్రెస్‌లో ‘సొంత’ పోరు!
X

దిశ, జోగులాంబ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి నివేదిక’ బస్సు యాత్ర జిల్లాలో రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు చేపట్టిన ఈ యాత్రలో గద్వాల కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు బహిర్గతమైనట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆయన అనుచర వర్గం యాత్రకు పూర్తిగా దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

బండ్ల, సరిత మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు!

గద్వాల నియోజకవర్గంలో మాజీ జెడ్పీ చైర్‌పర్సన్, ప్రస్తుత గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్యకు, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి మధ్య వార్ కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సరిత బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డి చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి గులాబీ గూడు విడిచి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో నియోజకవర్గంలో అసలైన లీడర్ ఎవరనే పంచాయతీ మొదలైంది. ప్రస్తుత బస్సు యాత్రలో సరితా తిరుపతయ్య తన అనుచరవర్గంతో భారీ ఎత్తున పాల్గొని బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే వర్గం ఈ కార్యక్రమానికి ముఖం చాటేయడం పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ, పార్టీ ఉమ్మడి అధికారిక కార్యక్రమానికి అధికార పార్టీ ఎమ్మెల్యేనే గైర్హాజరు కావడం వెనుక లోతైన రాజకీయ కారణాలు ఉన్నట్టు స్పష్టమవుతోంది.

ఎంపీతో పాత తగాదాలే కారణమా?

ఎమ్మెల్యే గైర్హాజరు వెనుక కేవలం స్థానిక ఆధిపత్య పోరు మాత్రమే కాదని, ఎంపీ మల్లు రవితో ఉన్న విభేదాలు కూడా కారణమనే చర్చ నడుస్తోంది. జిల్లాలో ఎంపీ మల్లు రవి వ్యవహారశైలిపై గతంలోనే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. గతంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా మల్లురవి తన ఎక్స్-ఆఫీషియో ఓటును గద్వాలలో వినియోగించుకోవడాన్ని సంపత్ కుమార్ బహిరంగంగానే తప్పుపట్టారు. నాటి పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు ఎంపీ నేతృత్వంలో జరుగుతున్న యాత్రకు గద్వాల ఎమ్మెల్యే దూరంగా ఉండటం జిల్లా కాంగ్రెస్‌లో సమన్వయ లోపాన్ని ఎత్తిచూపుతోంది.

గ్రూపు రాజకీయాలతో అధిష్టానానికి తలనొప్పి..

ఒకవైపు ఎంపీ మల్లు రవి, మరోవైపు అలంపూర్ పాత నేత సంపత్ కుమార్, గద్వాలలో సరితా తిరుపతయ్య.. ఇంకోవైపు అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి.. ఇలా ముగ్గురు, నలుగురు నేతలు తమ తమ వర్గాలతో సొంత రాజకీయం నడుపుతుండటంతో కేడర్ అయోమయంలో పడింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర పరిణామాల నేపథ్యంలో ఈ గ్రూపు రాజకీయాలు పార్టీకి పెద్ద మైనస్‌గా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటేనే తప్ప గద్వాల ‘హస్తం’ పంచాయతీ సద్దుమణిగేలా కనిపించడం లేదు.

Next Story