ఆదివాసీ గడ్డపై విరిసిన కమలం.. ఆదిలాబాద్‌లో బీజేపీ గెలుపునకు కారణాలివే!

by Muthe.Rajitha |   (  Updated:2026-02-13 12:59:50  IST  )

శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆదివాసీల జిల్లాలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది.

ఆదివాసీ గడ్డపై విరిసిన కమలం.. ఆదిలాబాద్‌లో బీజేపీ గెలుపునకు కారణాలివే!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పుకు సంకేతంగా నిలిచాయి. ఆదిలాబాద్‌లోని మొత్తం 49 వార్డుల్లో బీజేపీ 21 సీట్లు గెలిచి విక్టరీ నమోదు చేసింది. కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకోగా.. బీఆర్‌ఎస్ కేవలం 6 సీట్లకే పరిమితమైంది. మిగతా సీట్లు ఇండిపెండెంట్లకు దక్కాయి. ఇవి కేవలం సాధారణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మాత్రమే కాకుండా, రాష్ట్ర భవిష్యత్ రాజకీయ మార్పును కూడా సూచిస్తున్నాయి.

అయితే ఆదివాసుల గడ్డపై బీజేపీ విజయానికి ముఖ్య కారణం.. బలమైన స్థానిక నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన ప్రచారం అనై చెప్పుకోవాలి. ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు రోడ్లు, తాగునీటి సమస్యలు, డ్రైనేజ్, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాలను ప్రజల ముందు ఉంచారు. ముఖ్యంగా పాయల్ శంకర్ లాంటి స్థానిక నాయకులు ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. వారు గ్రామాలు, వార్డులు తిరిగి ప్రజలను నేరుగా కలిశారు. అదనంగా హిందుత్వ అంశాలను కూడా ప్రస్తావించారు. రామ్ మందిర్, యూనిఫాం సివిల్ కోడ్ వంటి విషయాలతో పట్టణ హిందూ ఓటర్లను ఆకర్షించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం 13% నుంచి 18%కు పెరగడం కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపింది.

మరో ముఖ్య కారణం ఓటు చీలిక. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ - బీఆర్‌ఎస్ మధ్య ఓట్లు చీలిపోయాయి. బీఆర్‌ఎస్ గతంలో ఆదిలాబాద్‌లో బలంగా ఉన్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పూర్తిగా బలహీన పడింది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, హామీల అమలులో ఆలస్యం కావడం వల్ల ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపించింది. గత ప్రభుత్వంపై, ప్రస్తుత ప్రభుత్వంపైన ఏర్పడ్డ అధికార వ్యతిరేకత బీజేపీకి లాభం కలిగించింది. బీజేపీ "అభివృద్ధి + హిందుత్వ" అనే రెండు అంశాలను కలిపి ప్రచారం చేసింది. ఇది యువత, పట్టణ, ఆదివాసీ వర్గాలపై ప్రభావం చూపింది.

కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా బీజేపీకి మద్దతు తీసుకువచ్చాయి. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం, రైల్వే ప్రాజెక్టులు, రహదారి పనులు, ఆదివాసీ సంక్షేమ పథకాలు వంటి అంశాలను బలంగా ప్రచారం చేశారు. PM-JANMAN వంటి పథకాలను ప్రస్తావిస్తూ కేంద్రం అభివృద్ధి చేస్తోందని చెప్పారు. సరిహద్దు జిల్లాగా ఉండటం వల్ల జాతీయవాద భావనలు కూడా కొంత ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

బీజేపీకి మరో ప్రధాన బలం వారి సంస్థాగత వ్యవస్థ. ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో ఉన్న గ్రాస్‌రూట్ నెట్‌వర్క్, బూత్ స్థాయి కార్యకర్తలు ఎన్నికల్లో చురుకుగా పని చేశారు. సోషల్ మీడియాను కూడా సమర్థవంతంగా వినియోగించుకొని ప్రచారం చేసారు. అంతేకాదు స్థానికంగా కొంతమంది ఇండిపెండెంట్లపై అసమ్మతి ఉండటం కూడా కమలానికి అనుకూలించింది.

ఇక కాంగ్రెస్ 11 సీట్లకే పరిమితం అయిన విషయానికి వస్తే.. పార్టీలో అంతర్గత విభేదాలు, అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి తీవ్రంగా ప్రభావం చూపింది. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ఆలస్యమవుతుందని ప్రజలు భావించారు. ఇక గులాబీ పార్టీ మాత్రం అసెంబ్లీ ఓటమి ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోలేకపోయింది. గత పాలనపై ఉన్న వ్యతిరేకత ఇంకా కొనసాగినట్టే కనిపించింది. జిల్లా నాయకత్వంలో స్పష్టత లేకపోవడం, కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గడం కూడా ఈ ఎన్నికలను ప్రభావితం చేశాయి.

మొత్తానికి ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలపై ఒక స్పష్టమైన సందేశం ఇచ్చాయి. స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి, బలమైన ప్రచారం, కేడర్ ను జాగ్రత్తగా కాపాడుకుంటే ప్రజలు మద్దతు ఇస్తారని సూచిస్తోంది. ఓట్ల చీలిక, అధికార పార్టీపై అసంతృప్తి, బలమైన సంస్థాగత వ్యవస్థ కూడా బీజేపీకి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఖాయం అనే సంకేతాలు అందిస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తమ బలహీనతలను సరిదిద్దుకుంటేనే భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించగలవని లేకుంటే ఆదివాసీల జిల్లాల్లో ఈ రెండు పార్టీలు నామరూపాల్లేకుండా పోవడం తథ్యం అని తెలుస్తోంది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

Next Story