- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరద ముప్పు ప్రాంతాలపై నిరంతర నిఘా ఉండాలి: హైడ్రా కమిషనర్
హైదరాబాద్‌లో 913 వరద ముప్పు ప్రాంతాలను గుర్తించామని, వానాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా డీఆర్ఎఫ్ బృందాలు 24/7 అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల కురిసిన వర్షానికి నగరం నీట మునిగిందని.. ఆ పరిస్థితులు పునరావృతం కారాదని హైడ్రా అధికారులతో పాటు డీఆర్ఎఫ్ బృందాలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. ఊహించని విధంగా పడుతున్న వర్షాలకు అనుగుణంగా మన ప్రణాళికలుండాలన్నారు. వర్షాకాల సన్నద్ధతపై డీఆర్ ఎఫ్ బృందాలకు శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ దిశానిర్దేశం చేశారు. వర్షం పడితే ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయనేది పూర్తి అవగాహన ఉండాలన్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 913 చోట్ల వరద ముంచెత్తే ప్రాంతాలను గుర్తించామని... ఇందులో మేజర్ ప్రాబ్లం ఉన్న ప్రాంతాలు 257 ఉన్నాయన్నారు.
ఈ పాయింట్ల వద్ద డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండాలని సూచించారు. 51 డీఆర్ఎఫ్ బృందాలకు తోడు.. త్వరలోనే మెట్, స్టాటిక్ టీమ్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయని హైడ్రా కమిషనర్ చెప్పారు. ఈ బృందాలన్నీ సమన్వయంతో.. ఇతర శాఖలతో కలసి పని చేయాలని సూచించారు. 24/7 మాదిరి వాతావరణ హెచ్చరికలను క్షుణ్నంగా పరిశీలించి.. వర్షానికి ముందే సన్నద్ధమవ్వాలన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తుతుందో.. అందుకు పరిష్కారం ఏంటో కూడా తెలియాలన్నారు. వర్షం పడినప్పుడు వరద ముంచెత్తకుండా చూడాలి.. వర్షం లేనప్పుడు సమస్యకు కారణాలపై దృష్టి పెట్టాలన్నారు.
ప్రజల సహకారం తీసుకోవాలి..
వర్షాకాలం తలెత్తే సమస్య పరిష్కారంలో ప్రజలను భాగస్వామ్యం చేసి.. వారి సహకారం తీసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ సూచించారు. మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద స్థానికులతో కలసి కమిటీలను ఏర్పాటు చేసి సమస్య పరిష్కారంలో వారిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. అలాగే మ్యాన్‌హోల్స్ ఎక్కడ ఉన్నాయనేది గుర్తించే విధంగా అక్కడ దగ్గర్లోని గోడకు మార్కింగ్ చేయాలని సూచించారు. ఈ నెల 9వ తేదీన ఒక్కసారిగా కురిసిన వర్షానికి నీట మునిగిన ప్రాంతాలపై సమీక్షించారు. అక్కడ వరద ముంచెత్తడానికి గల కారణాలను వివరించి.. ఆ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ప్రధాన రహదారులు ప్రథమ లక్ష్యంగా.. పని చేసి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలి.
ఒక్క రోజు నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తితే రూ. 400ల కోట్ల వరకూ నష్టం జరుగుతుందని నిపుణులు అంచనా వేశారని.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని హైడ్రా బృందాలు పని చేయాలని సూచించారు. అన్ని విభాగాలతో కలసి ఎక్కడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా జాగ్రత్త పడాలన్నారు. చెట్లు పడిపోయినప్పుడు సహాయక చర్యలు చేపట్టే సమయంలో మన డీఆర్ఎఫ్ వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండదని.. ఆ సమయంలో బైకులపై చేరే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అంతకు ముందు హైడ్రా అదనపు సంచాలకులు పాపయ్య, అడిషనల్ కమిషనర్ ఆర్.సుదర్శన్ మాట్లాడి.. వర్షాకాల సన్నద్ధతపై పలు సూచనలు చేశారు. ఏసీపీలు పి.తిరుమల్, ఉమా మహేశ్వర రావు, శ్రీకాంత్, ఆర్ఎఫ్‌వో జయప్రకాష్ తో పాటు డీఎఫ్‌వోలు, ఎస్ఎఫ్వోలు, ఇన్‌స్పెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.






