దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. 40 శాతం దేశీయ ఉత్పత్తి పెరిగింది: కేంద్ర ప్రభుత్వం స్పష్టత

by Malleboina Mahesh |

దేశంలో LPG కొరత లేదు: కేంద్రం స్పష్టత. 40% పెరిగిన దేశీయ ఉత్పత్తి, సేఫ్ గా ఉన్న 22 ట్యాంకర్లు. పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. 40 శాతం దేశీయ ఉత్పత్తి పెరిగింది: కేంద్ర ప్రభుత్వం స్పష్టత
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ vs ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో వంటగ్యాస్ (cooking gas) పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో (LPG) సరఫరాపై నెలకొన్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా దేశీయ రిఫైనరీల్లో ఎల్పీజీ ఉత్పత్తిని 40 శాతం మేర పెంచామని, దేశవ్యాప్తంగా ఎక్కడా గ్యాస్ స్టాక్ నిలిచిపోయిన (Dry-out) పరిస్థితి లేదని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ (Sujata Sharma) ఈ రోజు మధ్యాహ్నం స్పష్టం చేశారు. అలాగే హర్మూజ్ జలసంధి వద్ద ఉన్న 22 భారతీయ ట్యాంకర్లు సురక్షితంగా ఉన్నాయని, ఇప్పటికే 'నందాదేవి', 'శివాలిక్' నౌకలు గుజరాత్ తీరానికి చేరుకుని అన్-లోడింగ్ ప్రక్రియను ప్రారంభించాయని ఆమె తెలిపారు.

ప్రజలు సోషల్ మీడియా పుకార్లను నమ్మి పానిక్ బుకింగ్స్ (Panic bookings) చేయవద్దని, ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుంటే సిలిండర్లు నేరుగా ఇంటికే అందుతాయని భరోసా ఇచ్చారు .వ్యాపార అవసరాల కోసం ఇప్పటికే 15 రాష్ట్రాలు కమర్షియల్ సిలిండర్ల కేటాయింపును ప్రారంభించాయని, గత నాలుగు రోజుల్లోనే దేశవ్యాప్తంగా 7,200 టన్నుల కమర్షియల్ ఎల్పీజీని పంపిణీ చేసినట్లు సుజాత శర్మ వివరించారు. భారత్ దాదాపు 40 దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నందున ఎటువంటి కొరత ఉండదని, మన రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

అలాగే గృహ వినియోగదారులు సాధ్యమైనంత వరకు ఎల్పీజీ (LPG) నుండి పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) కి మారాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. దీనివల్ల ఎల్పీజీపై ఒత్తిడి తగ్గుతుందని, ఇప్పటికే దేశంలోని 60 లక్షల కుటుంబాలు పీఎన్‌జీకి మారే అవకాశం ఉందని అధికారులు గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. ఎల్పీజీ బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించింది.

Next Story