స్థానిక రైతుల కష్టానికి ధర లేదు.. బాహ్య కూరగాయలకే గిరాకీ

by Batti.Sumithra |

ములుగు మండలంలోని వంటిమామిడి కూరగాయల మార్కెట్‌లో ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున కూరగాయలు దిగుమతి అవుతుండటంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక రైతుల కష్టానికి ధర లేదు.. బాహ్య కూరగాయలకే గిరాకీ
X

దిశ, ములుగు : ములుగు మండలంలోని వంటిమామిడి కూరగాయల మార్కెట్‌లో ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున కూరగాయలు దిగుమతి అవుతుండటంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధరలు దక్కకపోవడానికి దళారుల వ్యవస్థే ప్రధాన కారణమని వారు ఆరోపిస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించి గిట్టుబాటు ధర పొందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి అందుకు విరుద్ధంగా మారిందని రైతులు వాపోతున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి కూరగాయలను తీసుకువచ్చి మార్కెట్‌లో విక్రయిస్తుండటంతో స్థానికంగా పండించిన కూరగాయలకు డిమాండ్ తగ్గిపోయిందని తెలిపారు.

దీంతో రైతులు తమ పంటలను తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోందని, కొన్నిసార్లు ఉత్పత్తి ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మార్కెట్‌లో రైతుల కంటే దళారులకే అధిక ప్రాధాన్యం లభిస్తోందని ఆరోపించారు. స్థానిక రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన అధికారులు మార్కెట్‌లో జరుగుతున్న వ్యవహారాల పై పర్యవేక్షణ పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాసిరకం (డి-గ్రేడ్) కూరగాయల విక్రయాలను నియంత్రించి, స్థానికంగా పండించిన తాజా కూరగాయలకు మార్కెట్‌లో ప్రాధాన్యం కల్పించాలని కోరుతున్నారు.

రైతు అంజిరెడ్డి మాట్లాడుతూ స్థానికంగా పండించిన తాజా కూరగాయలు అమ్ముడుపోకపోతుండగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూరగాయలను వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని మార్కెట్‌లో స్థానిక రైతులకు ప్రాధాన్యం కల్పించాలి. లేనిపక్షంలో రైతులమంతా కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. స్థానిక రైతుల కష్టానికి తగిన గుర్తింపు లభించేలా, వారి పంటలకు గిట్టుబాటు ధర దక్కేలా ప్రభుత్వం, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి.

Next Story