పోలీసులు న‌న్ను అరెస్ట్ చేయొచ్చు: అభిజీత్ దీప్కే

by Thanuru Gopichand |

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనను పొడిగించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం సంచలన ఆరోపణలు చేశారు.

పోలీసులు న‌న్ను అరెస్ట్ చేయొచ్చు: అభిజీత్ దీప్కే
X

దిశ‌, నేష‌న‌ల్ బ్యూరో: దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేంత వరకు తాము జంతర్ మంతర్ వదిలి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశ నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగుతుందని, శాంతియుతంగా సాగుతున్న ఈ ఆందోళనకు అనుమతిని పొడిగించాలని ఆయన ఢిల్లీ పోలీసులను కోరారు. ఒకవేళ పోలీసులు అరెస్టులు చేయాలనుకుంటే తానే మొదటి వ్యక్తిగా జైలుకు వెళ్తానని, కేంద్రంతో చర్చలకు మంత్రి రాజీనామాయే ఏకైక నిబంధన అని తేల్చిచెప్పారు.

నిర‌స‌న‌కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనను పొడిగించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ.. ఒకవేళ తాను అరెస్ట్ అయినా దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ శాంతియుత పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దని పిలుపునిచ్చారు. సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు తమతమ జిల్లాల్లో 'జైల్ భరో ఆందోళన' చేపట్టాలని కోరారు. నీట్ పేపర్ లీకేజీ అక్రమాలతో పాటు సీబీఎస్‌ఈ ఓఎస్ఎమ్ వ్యవస్థలోని లోపాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా చేపట్టే ఈ ఆందోళనలు పూర్తిగా శాంతియుతంగానే జరగాలని ఆయన స్పష్టం చేశారు.

శనివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన ఈ రెండో విడత నిరసనకు సాయంత్రం 5 గంటల వరకే పోలీసులు అనుమతి ఇచ్చారు. సమయం ముగియడంతో పోలీసులు నిరసన స్థలాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేయగా, దీప్కే అక్కడ నుండి కదిలేందుకు నిరాకరిస్తూ యువతను కూడా వెనక్కి తగ్గవద్దని కోరారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ జరిగిన ఈ ఆందోళనలో విద్యార్థులు ప్లేట్లు, చెంచాలు మోగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. "ఒక అసమర్థ మంత్రిని కాపాడటానికి ఇంత పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.. ఈ ప్రభుత్వానికి యువత భవిష్యత్తు కంటే ఆ ఒక్క మంత్రిపైనే ఎందుకు అంత ప్రేమ?" అని సీజేపీ సోషల్ మీడియా వేదికగా నిలదీసింది.

Next Story