ఆరోగ్య పర్యావరణ సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ మన అందరి భాద్యత

by velandi.Saikiran |

ఆరోగ్య పర్యావరణ సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ మన అందరి భాద్యత అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు.

ఆరోగ్య పర్యావరణ సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ మన అందరి భాద్యత
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆరోగ్య పర్యావరణ సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ మన అందరి భాద్యత అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో జరిగిన ఆరోగ్య పర్యావరణ సుస్థిరత అంతర్జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గాలి కలుషితమైతే ఆరోగ్యానికి హానితో పాటు ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, వృద్ధులు, పిల్లలు... ముఖ్యంగా బలహీన వర్గాలు తీవ్రంగా ఇబ్బందులు పడతారని తెలిపారు. వరదలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఆరోగ్య సేవలపై అదనపు ఒత్తిడి పెరుగుతుందని అందువల్ల, వాతావరణ మార్పు అనేది పర్యావరణానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని... అది మన ఆరోగ్యానికి సంబంధించినదన్నారు. గత కొన్నేళ్లుగా ఆరోగ్య రంగంలో మనదేశం గణనీయమైన పురోగతిని సాధించిందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్, డిజిటల్ హెల్త్ సర్వీసెస్, వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌లు, ఆరోగ్య సౌకర్యాల విస్తరణ దేశంలోని కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చాయని తెలిపారు. ఇప్పుడు మనం ఆరోగ్య సేవల యొక్క తదుపరి ప్రయోగాలు చేస్తూ, చికిత్స అందించడంలో మెరుగైన ఆరోగ్య వ్యవస్థ వైపు మాత్రమే కాకుండా పర్యావరణం పట్ల బాధ్యత, భవిష్యత్తు సవాళ్లకు సిద్ధంగా ఉండాలని అన్నారు.

ప్రముఖ స్థానంలో తెలంగాణ వైద్యరంగం

ఆరోగ్య సేవలు, వైద్య విద్య, సాంకేతికత, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణ దేశంలోనే ప్రముఖ స్థానాన్ని అందుకుందని ఐఆర్డీఏఐ చైర్మన్ అజయ్ సేథ్ తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నేడు దేశంలోని ప్రధాన ఆరోగ్య కేంద్రాలలో ఒకటిగా నిలిచిందన్నారు. ఆధునిక ఆసుపత్రులు, పరిశోధనా సంస్థలు, ఫార్మా పరిశ్రమ, ఆరోగ్య రంగంలో కొత్త ప్రయోగాలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆరోగ్య సంస్థలు ముఖ్యమైన పాత్ర వహిస్తాయని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సంజయ్ జోద్పాయ్ తెలిపారు. శక్తిని ఆదా చేయడం, నీటిని ఆదా చేయడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, వనరులను తెలివిగా ఉపయోగించడం, ఈ దశలన్నీ ఆరోగ్యకరమైన, మెరుగైన భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు. మన పర్యావరణం సురక్షితంగా ఉన్నప్పుడే అభివృద్ధి కల నెరవేరుతుందని యశోద హాస్పిటల్ ఎండీ డా. జి సురేందర్ రావు పేర్కొన్నారు. ఆరోగ్యం, పర్యావరణం ప్రత్యేక అంశాలు కావని, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కూడా సృష్టించుకోవాలన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో జరిగే చర్చలు దేశ ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టంగా, స్థిరంగా, భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచడంలో సహాయపడతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆర్గనైజింగ్ చైర్మన్ డా. లింగయ్య, డా. అలెగ్జాండర్ థామస్, డా. మంతా రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story