- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
27 లక్షల మంది విద్యార్థులకు విజయ పాలు
శనివారం సచివాలయంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ పాఠశాలలు,అంగన్ వాడీ కేంద్రాలకు విజయ డెయిరీ నుంచి పాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీనం సాగిస్తున్న రైతులను ఆదుకోవడంతో పాటు విజయా డైరీనీ ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. రాష్ట్రంలోని పాడిపరిశ్రమను ఆదుకోవాలని, పాల ఉత్పత్తులపై ఆధారపడిన వారి జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రజాప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పాల వినియోగం వివిధ పాఠశాలల్లో చదువుకుంటున్న 27 లక్షల మంది విద్యార్థులకు అందిస్తామని, మొత్తం పాల ఉత్పత్తికి సంబంధించి ఖచ్చితమైన లెక్కలు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పాలిచ్చే పశువుల అసలు సంఖ్యను గుర్తించాలని సూచించారు.
పాలిచ్చే పశువుల ద్వారా వస్తున్న వాస్తవ ఉత్పత్తిని లెక్కగట్టి సమగ్ర నివేదికను తదుపరి సమావేశంలో ఇవ్వాలని సంబంధిత అధికారులకు చెప్పారు. రైతుల నుంచి సేకరించే పాల ధరపై స్పష్టమైన విధానం ఉండాలని, రైతులకు బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలన్నారు. పాఠశాలలకు సరఫరా చేసే పాలకు సంబంధించిన బిల్లులను సంక్షేమ శాఖలు నేరుగా ఆయా విభాగాలకే బదిలీ చేయాలన్నారు. దీనివల్ల రైతులకు ఎలాంటి బకాయిలు ఉండవని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పాడి పరిశ్రమ మీదే ఆధారపడతారని తెలిపారు. పాడి రైతులకు సమయానికి డబ్బులు చెల్లిస్తే వారి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుంది. డైరీకి నమ్మకంతో పాలు పోస్తారని అన్నారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు, పాల ఉత్పత్తులను గణనీయంగా పెంచేందుకు ఆధునిక పద్దతులను అనుసరించాలని సూచించారు. రైతులకు వ్యవసాయం పైనే కాకుండా, పాడి పరిశ్రమ ద్వారా అదనపు జీవనోపాధి కల్పించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజలకు అవసరాలకు తగ్గ పాల ఉత్పత్తి లేదు : మంత్రి వాకిటి శ్రీహరి
రాష్ట్రంలో అవసరాలకు తగ్గ పాల ఉత్పత్తి జరగడం లేదని, పక్క రాష్ట్రాల నుండి పాలను దిగుమతి చేసుకుంటున్నామని, ఈ సమస్యను అధిగమించాలంటే పాడి రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. బయటి రాష్ట్రాల నుండి పాలను దిగుమతి చేసుకోకుండా మన రాష్ట్రంలోని రైతుల నుండే పాలను సేకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించగా దీనిని అవకాశంగా మలుచుకొని రాష్ట్రంలో అధిక పాల ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయ డైరీ నుండి ఐసీడీఎస్‌కు ప్రస్తుతం ప్రభుత్వం లీటర్ పాలకు రూ. 57 చెల్లిస్తోందని ఇకపై లీటర్ పాలను రూ. 62 కొనుగోలు చేస్తే విజయ డైరీ కి లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు.






