- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వీబీజీ రామ్‌జీ’ ఉపాధి హామీ చట్టంలో కోతలు వద్దు: కేంద్రమంత్రికి సీతక్క లేఖ
గ్రామీణ పేదలు, దళితులు, ఆదివాసీలు, అట్టడుగు వర్గాల ఉపాధి హక్కుకు గండి కొట్టేలా ఉన్న ‘వీబీజీ రామ్‌జీ’ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధాతథంగా కొనసాగించాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణ పేదలు, దళితులు, ఆదివాసీలు, అట్టడుగు వర్గాల ఉపాధి హక్కుకు గండి కొట్టేలా ఉన్న ‘వీబీజీ రామ్‌జీ’ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధాతథంగా కొనసాగించాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆమె మూడు వేర్వేరు లేఖలు రాశారు. ఆ లేఖల్లో తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను, క్షేత్రస్థాయి అవసరాలను వివరించారు. వీబీజీ రామ్‌జీ చట్టంలో పొందుపరిచిన నిబంధనలు గ్రామీణ కుటుంబాల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రధానంగా నిధుల కేటాయింపును రాష్ట్ర స్థాయికి పరిమితం చేయడం వల్ల, వెనుకబడిన ప్రాంతాల అవసరాలు విస్మరణకు గురవుతాయన్నారు.
పంచాయతీలకు ప్రాధాన్యత ఇవ్వాలి..
రాష్ట్రానికే ఒకే యూనిట్‌గా కాకుండా, గత ఐదేళ్ల పనిదినాల ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు 80 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని సీతక్క లేఖలో డిమాండ్ చేశారు. నిధుల పంపిణీ, పనితీరు ప్రమాణాల్లో కేంద్రానికే అపరిమిత అధికారాలు ఉండటం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, రాష్ట్రాలతో చర్చించాకే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల వంటి రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలను కూడా వీబీజీ రామ్‌జీ పరిధిలోకి తీసుకురావాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎంజీఎన్‌ఆర్ఈజీఎస్‌లో గృహ నిర్మాణ లబ్ధిదారులకు లభించే 90 రోజుల ఉపాధి అవకాశం కొత్త చట్టంలో తొలగిపోవడం వల్ల పేదలు నష్టపోతారని పేర్కొన్నారు. వ్యక్తిగత భూ అభివృద్ధి, కూరగాయల పందిళ్లు, పశుగ్రాసం, న్యూట్రి గార్డెన్లు వంటి వ్యవసాయ అనుబంధ పనులకు అనుమతి ఇవ్వాలని మంత్రి సీతక్క కోరారు.
విరామం వద్దు..
నూతన చట్టంలో ప్రతిపాదించిన 60 రోజుల తప్పనిసరి ఉపాధి విరామాన్ని మంత్రి సీతక్క వ్యతిరేకించారు. ఆదివాసీ ప్రాంతాలు, నీటి ఎద్దడి ఉన్న మండలాల్లో ఉపాధి హామీ పథకమే ప్రధాన జీవనాధారమని, ఈ సమయంలో పనులు నిలిపివేస్తే పేదల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం పనులు వర్షాకాలంలోనే చేపట్టాల్సి ఉంటుందని, కాబట్టి వీటిని విరామం నుంచి మినహాయించాలని కోరారు. పేదలకు ఉపాధి భరోసా కల్పించడం, గ్రామ పంచాయతీల అధికారాలను బలోపేతం చేయడం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కేంద్రం సానుకూలంగా స్పందించి, చట్టంలో తగిన మార్పులు చేస్తుందని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.






