శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు : డి.జోయెల్ డేవిస్

by Batti.Sumithra |

ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే, ప్రతీ పోలీస్ అధికారి లక్ష్యమని, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని యాదాద్రి జోన్-5 డీఐజీ డి. జోయెల్ డేవిస్ అన్నారు.

శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు : డి.జోయెల్ డేవిస్
X

దిశ, నల్లగొండ క్రైం : ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే, ప్రతీ పోలీస్ అధికారి లక్ష్యమని, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని యాదాద్రి జోన్-5 డీఐజీ డి. జోయెల్ డేవిస్ అన్నారు. యాదాద్రి జోన్-5 డీఐజీ, డీజోయెల్ డేవిస్ సోమవారం నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి, జిల్లా పోలీసు అధికారులతో సమగ్ర నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లాలోని బౌగోళిక పరిస్థితులు, శాంతిభద్రతల పరిస్థితి, నేరాల ధోరణి, పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, బందోబస్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్, ప్రజలకు అందిస్తున్న సేవలు, పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాల పై సమగ్ర ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా డీఐజీ డి.జోయెల్ డేవిస్, మాట్లాడుతూ నల్లగొండ జిల్లా పోలీసు శాఖ పనితీరు అత్యుత్తమంగా ఉందని అభినందించారు.

ఇదే క్రమశిక్షణ, అంకితభావం, ప్రజాసేవా దృక్పథంతో ప్రతి అధికారి విధులు నిర్వర్తించాలని సూచించారు. గ్రామస్థాయిలో విలేజ్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలతో నిరంతరం మమేకమై స్థానిక సమస్యలు, వివాదాలు, అనుమానాస్పద కదలికల పై ముందస్తు సమాచారం సేకరించి నేరాలను ప్రారంభ దశలోనే అరికట్టాలని ఆదేశించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. రౌడీషీటర్లు, బైండోవర్ వ్యక్తులు, పాత నేరస్తులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులు, అసాంఘిక శక్తుల పై నిరంతర నిఘా కొనసాగించాలని, నైట్ పెట్రోలింగ్, నాకాబందీలు, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, వాహన తనిఖీలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నల్లగొండ జిల్లా అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఇతర నేర కార్యకలాపాల పై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ అత్యంత కీలకమని పేర్కొంటూ, శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ సాక్ష్యాలు, డిజిటల్ ఎవిడెన్స్‌ను సమర్థవంతంగా వినియోగించి దర్యాప్తు చేపట్టాలని సూచించారు.

ప్రతి ఎస్‌హెచ్‌ఓ ఒక సమర్థవంతమైన నాయకుడిగా తన పోలీస్ స్టేషన్‌కు దిశానిర్దేశం చేస్తూ, సిబ్బందిని సమన్వయం చేసుకొని నేర నియంత్రణలో తనదైన ముద్ర వేయాలని డీఐజీ సూచించారు. పారదర్శకత, జవాబుదారీతనం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ, భవిష్యత్ పోలీసింగ్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్పీ జిల్లా డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలతో సమావేశమై వారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని నేరాల పరిస్థితి, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాల పై సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, ఎస్‌బీ డీఎస్పీ మల్లారెడ్డి, నల్లగొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి, దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, డీటీసీ డీఎస్పీ నగేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story