వైద్యశాఖలో 40శాతం ఖాళీలే

by Muthe.Rajitha |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలని వైద్యశాఖలో ఖాళీలు వెక్కిరిస్తున్నారు.

వైద్యశాఖలో 40శాతం ఖాళీలే
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలని వైద్యశాఖలలో ఖాళీలు వెక్కిరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 ఆర్బన్ హెల్త్ సెంటర్లు, 5 బస్తీ దవాఖానాలు, 4 అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని విభాగాలలో మొత్తంగా 955 మంది సిబ్బందికి 579మంది మాత్రమే ఉండగా, ఇంకా 376 ఖాళీలు దర్శనమిస్తున్నాయి. 60శాతం సిబ్బందితోనే వైద్యసేవలను అందిస్తూ వైద్య సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారు. ఆసుపత్రులలో సరిపడా వైద్యులు, సహాయక సిబ్బంది లేకపోవడంతో రోగులకు సకాలంలో వైద్యులు మెరుగైన వైద్యసేవలను అందించలేకపోతున్నారు. సిబ్బందితోనే వైద్యం చేయించుకునే పరిస్థితి నెలకొంది. ఏరియా ఆసుపత్రులలో పెద్ద జబ్బులతో వస్తే సరిపడా స్పెషలిస్టు వైద్యులు, సర్జన్లు లేకపోవడంతో నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు ప్రైవేట్ వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు.

- దిశ, కొత్తగూడెం ప్రతినిధి

దిశ, కొత్తగూడెం ప్రతినిధి : ప్రభుత్వం పట్టణ, గ్రామాల్లోని ప్రజలకు నిరంతరం ప్రజారోగ్యం, మెరుగైన వైద్యసదుపాయాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెబుతున్నప్పటికీ అవి ఎక్కడా ఆచరణకు నోచుకోవడం లేదని తెలుస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆసుపత్రులలో వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న రోగులకు వైద్యులు శక్తివంచన లేకుండా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. కానీ ఆసుపత్రులలో మాత్రం సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. దీంతో అందుబాటులో ఉన్న వైద్యులు తమకు చేతనైన వరకు వైద్యం అందిస్తున్నప్పటికీ పెద్ద పెద్ద సర్జరీలు చేసేందుకు సరిపడా స్పెషలిస్టు వైద్యులు లేకపోవడంతో ఆపరేషన్లు చేసేందుకు కొంత వరకు ఇబ్బందులుపడుతున్నారు. వైద్యులు ధైర్యం చేసి ఒకడుగు ముందుకు వేసి ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయితే ఒకలాగా, సక్సెస్ కాకపోతే రోగి కుటుంబసభ్యులు మరోలాగా ప్రవర్తించడంతో వైద్యులు జంకుతున్నారు. దీంతో మనకెందుకు వచ్చిన సమస్య అనుకొని వైద్యులు రోగిని ఇతర జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.

వెక్కిరిస్తున్న ఖాళీలు..

జిల్లా వైద్యశాఖలో ఖాళీలు వెక్కిరిస్తున్నారు. వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఆసుపత్రిలో ఉన్న వైద్యులతోనే నెట్టుకువస్తున్నారు. దాదాపు జిల్లా అంత ఏజెన్సీ ప్రాంతం కావడం, దీనికి తోడు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వైద్య సహాయం కోసం భద్రాది కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య సాయం కోసం వస్తూ పోతుంటారు. ఇటు జిల్లా ప్రజలు, మరోవైపు ఇతర రాష్ట్రాల సరిహద్దు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపైనే వైద్య సహాయం కోసం ఆధారపడుతున్నారు. జిల్లాలో మొత్తం 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 ఆర్బన్ హెల్త్ సెంటర్లు, 5 బస్తీ దవాఖానాలు, 4 అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో దాదాపు అరకొర సిబ్బంది మాత్రమే ఉండటంతో ఆశించిన స్థాయిలో ప్రజలకు వైద్యసేవలను అందించలేకపోతున్నారనే స్పష్టంగా తెలుస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో అన్నీ విభాగాలలో మొత్తంగా 955 మంది సిబ్బందికి 579మంది మాత్రమే ఉండగా, ఇంకా 376 ఖాళీలు దర్శనమిస్తున్నాయి. 60శాతం సిబ్బందితోనే వైద్యసేవలను అందిస్తూ వైద్య సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 65మందికి 28మంది, డిప్యూటీ సివిల్ సర్జన్లు 10మందికి ఇద్దరు, నర్సింగ్ ఆఫీసర్లు 59మందికి గాను 31మంది, ఫార్మసిస్టులు 38 మందికి గాను 26మందికి గాను వివిధ ఆసుపత్రులలో సేవలను అందిస్తున్నారు. ఇక ల్యాబ్ టెక్నీషీయన్లు 5, రేడియోగ్రాఫర్లు 5, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు 5 మొత్తంగా సిబ్బంది లేక ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. ఇక గ్రామాలలో ప్రాథమిక వైద్య సేవలు, గర్భిణీలకు వారి ఆరోగ్యంపై, వివిధ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు పనిచేసే మల్టీ పర్పస్ హెల్త్ అసిసెంట్లు 335మందికి గాను 231మంది మాత్రమే సేవలను అందిస్తున్నారు.

పనిభారంతో అవస్థలు

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో సరిపడా వైద్యులు, సహాయక సిబ్బంది లేకపోవడంతో రోగులకు సకాలంలో వైద్యులు మెరుగైన వైద్యసేవలను అందించలేకపోతున్నారు. మారుమూల గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు సెలవు పెట్టాల్సి వస్తే ఆ రోజు అక్కడ ఉన్న సిబ్బంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల గుండాలలో గర్భిణీ మృతి చెందిన ఘటనే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. గ్రామాలలో, పట్టణాలలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు వ్యాధులబారిన పడకుండా ఉండేందుకు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న సిబ్బందితో కార్యక్రమాలను ఏర్పాటు చేయాలంటే తలకుమించిన భారంగా మారనుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

పెద్దరోగం వస్తే..

గ్రామాలలోని ప్రజలు అనారోగ్యం బారినపడి జిల్లా ఆసుపత్రికి వస్తే అక్కడ పరీక్షలు చేసేందుకు సిబ్బంది లేకపోవడం, అందుబాటులో ఉన్న సిబ్బందితోనే వైద్య పరీక్షలు చేయించుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. ఫలితంగా వైద్య సహాయం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఏరియా ఆసుపత్రులలో పెద్ద జబ్బులతో వస్తే సరిపడా స్పెషలిస్టు వైద్యులు, సర్జన్లు లేకపోవడంతో ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇక పేదవాడికి జబ్బు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రే గతి అయినప్పటికీ వైద్య సిబ్బంది సరిపడా లేకపోవడంతో అప్పులు చేసి ప్రైవేట్ వైద్యశాలకు వెళ్ళి చికిత్సలు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు నిరంతంరం అందించేందుకు కృషి చేయాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

60శాతం సిబ్బందితోనే సేవలను అందిస్తున్నాం - తుకారాం రాథోడ్, డీఎంహెచ్ఓ

జిల్లాలో వైద్య సిబ్బంది కొరత ఉన్న మాట నిజమే. ప్రధానంగా వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్ల సమస్య అధికంగా ఉంది. అయినప్పటికీ ఉన్న సిబ్బందితోనే రోగులకు మెరుగైన వైద్య సాయం అందిస్తున్నాం. ఖాళీల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది. అందుకే మారుమూల గ్రామాల నుంచైన ప్రజలు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రులకే వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. వర్షాకాలం సీజనల్లో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా ఇప్పటికే వైద్య సిబ్బందికి, కిందిస్థాయిలో పనిచేసే సిబ్బందికి సూచనలు చేశాం.

Next Story