- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడేళ్లయినా అసంపూర్తిగానే.. ముగియని బస్టాండ్ ముచ్చట!
వరంగల్ నగరంలో అత్యాధునిక స్మార్ట్ సిటీ బస్టాండ్ నిర్మాణం మూడేళ్లు దాటిన అసంపూర్తిగానే మిగిలిపోయింది.

వరంగల్ నగరంలో అత్యాధునిక స్మార్ట్ సిటీ బస్టాండ్ నిర్మాణం మూడేళ్లు దాటిన అసంపూర్తిగానే మిగిలిపోయింది. కుడా పరిధిలో రూ.74.50కోట్ల నిధులతో ఈ ఐదు అంతస్తుల బస్టాండ్ నిర్మాణాన్ని తలపెట్టారు. నిధుల కొరత, రాజకీయ జోక్యం, కాంట్రాక్టర్ అలసత్వం వల్ల పనులు సగం కూడా పూర్తి కాలేదు. పాత బస్టాండ్ కూల్చివేయడంతో ప్రస్తుతం బస్సులన్నింటినీ రోడ్లపైనే నిలపాల్సి వస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి వచ్చే దూరప్రాంత ప్రయాణికులు ఆశ్రయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో నిర్మాణ స్థలమంతా నీట మునిగి, బురదమయంగా మారి అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిధులు విడుదల చేసి ఈ కీలక బస్టాండ్‌ను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
దిశ, వరంగల్ బ్యూరో : ఉత్తర తెలంగాణలోనే అత్యంత కీలకమైన వరంగల్ బస్టాండ్ నిర్మాణ వ్యవహారం ప్రయాణికులకు శాపంగా మారింది. మూడేళ్ల కింద గత ప్రభుత్వ హయాంలో ఈ బస్టాండ్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. సరికదా.. కనీసం సగం పనులు కూడా జరగలేదు. రాజకీయ జోక్యం, సకాలంలో నిధులు విడుదల కాకపోవడం, కాంట్రాక్టర్ అలసత్వం కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వరంగల్ నగరానికి వచ్చే వారితో పాటు, ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు కనీస ఆశ్రయం లేక రోడ్లపైనే అల్లాడుతున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్‌కు సరిగ్గా ఎదురుగా ఉండే ఈ పాత బస్టాండ్‌ను పూర్తిగా కూల్చివేసి మూడేళ్లు గడుస్తున్నా కొత్త భవనం అందుబాటులోకి రాకపోవడంతో బస్సులను రోడ్లపైనే నిలపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రూ.74.50కోట్లు.. ఐదు అంతస్తుల ప్లాన్..
వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో స్మార్ట్ సిటీ మోడల్‌లో అత్యాధునిక వసతులతో ఈ కొత్త బస్టాండ్‌ను తలపెట్టారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)కు చెందిన రూ.74.50కోట్ల నిధులతో 32ప్లాట్‌ఫారమ్‌లు, ఐదు అంతస్తులతో ఈ భవనాన్ని డిజైన్ చేశారు. ఇందులో భారీ కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్, హోటళ్లు నిర్మించేలా, రాబోయే 2050 సంవత్సరం అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేశారు. రైల్వే స్టేషన్‌తో అనుసంధానిస్తూ ప్రధాన రహదారి విస్తరణ పనులను కూడా ఇందులో చేర్చారు. ఇంతటి భారీ ప్రాజెక్టును కాగితాలపై అద్భుతంగా చూపించినప్పటికీ, క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
వర్షం వస్తే నరకప్రాయం... అధికారుల నిర్లక్ష్యం..
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రయాణికుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. కురిసిన కొద్దిపాటి వర్షానికే నిర్మాణ ప్రాంతమంతా నీట మునుగుతోంది. రైల్వే స్టేషన్ నుంచి రైలు దిగి వచ్చే ప్రయాణికులు కనీసం బస్సు ఎక్కడానికి కూడా వీల్లేకుండా బురదమయంగా మారుతోంది. రోడ్డుపై బస్సులు ఆపడం వల్ల ట్రాఫిక్ జాం సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా పాలకులు, సంబంధిత అధికారులు నిర్మాణ వేగాన్ని పెంచేందుకు చొరవ చూపడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిధుల సమస్యను పరిష్కరించి వరంగల్ అత్యాధునిక బస్టాండ్ నిర్మాణాన్ని యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని ప్రయాణికులు, నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.






