- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాను చనిపోయానంటూ భర్త శ్రద్ధాంజలి పోస్టు.. భార్య ఆత్మహత్య
కుటుంబంలో జరిగిన చిన్నపాటి గొడవ, వాట్సాప్ స్టేటస్ నిర్వాకం కారణంగా ఒకరి ప్రాణం పోగా, మరొకరు ఆసుపత్రి పాలు కావడంతో ఇద్దరు పసిపిల్లలు అనాథలయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : కుటుంబంలో జరిగిన చిన్నపాటి గొడవ, వాట్సాప్ స్టేటస్ నిర్వాకం కారణంగా ఒకరి ప్రాణం పోగా, మరొకరు ఆసుపత్రి పాలు కావడంతో ఇద్దరు పసిపిల్లలు అనాథలయ్యారు. తమిళనాడులోని తిరుత్తురైపూండి సమీపంలో బుధవారం రాత్రి ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కరుంబియూర్‌కు చెందిన ప్రవీణ్ నాగపట్నంలోని ఒక పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, నాలుగున్నరేళ్ల బాబు, రెండేళ్ల కూతురు ఉన్నారు. బుధవారం రోజున దంపతుల మధ్య ఏదో విషయమై తీవ్రమైన గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రవీణ్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళిపోయాడు. మేట్టుపాలయం ప్రాంతానికి చేరుకున్న ప్రవీణ్, అక్కడ విషం తాగాడు. అయితే, విషం తాగడానికి కాసేపు ముందు.. తన ఫోటోతో తానే స్వయంగా ఒక శ్రద్ధాంజలి పోస్టర్‌ను తయారు చేసుకొని, దాన్ని తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. అది చూసిన భార్య గాయత్రి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. తన భర్త అప్పటికే చనిపోయాడని భావించి, తీవ్ర మనస్తాపంతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మిన్నంటిన పిల్లల రోదనలు
మరోవైపు, విషం తాగి రోడ్డుపై పడి ఉన్న ప్రవీణ్‌ను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, అతడిని తిరుత్తురైపూండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో అతనికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. భర్త వాట్సాప్ స్టేటస్ చూసి భార్య ప్రాణాలు తీసుకోవడం, భర్త ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుండటంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లి లేక, తండ్రి ఆసుపత్రి పాలు కావడంతో ఆ ఇద్దరు పసిపిల్లలు ఏడుస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






