జోరుగా పాఠ్యపుస్తకాల దందా..!

by Jakkula.Mamatha |

ప్రైవేట్ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్దంగా అడ్డదారుల్లో యధేచ్చగా పాఠ్యపుస్తకాల వ్యాపారం జోరుగా సాగుతోంది.

జోరుగా పాఠ్యపుస్తకాల దందా..!
X

ప్రైవేటు పాఠశాలల్లో విద్యతోపాటు ఇతరత్రా వ్యాపారం జోరుగా సాగుతోంది. యూనిఫాంలు, నోటు పుస్తకాలు, సాక్సుల వ్యాపారం చేస్తూ దొరికినంత దండుకుంటున్న యాజమాన్యాలు ఏకంగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌ విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. దుకాణాల యాజమాన్యాలతో కుమ్మక్కయిన ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు కమీషన్ల కోసం పాఠశాలల్లోనే కౌంటర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తకాలు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పూర్తి ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీ జరుగుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మాత్రం వాటిని రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. షాపు యజమానుల ప్రోత్సాహంతో పాఠశాలల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడే కొనాలని పోషకులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులు, యూనిఫాంలు, సాక్సులు తదితర సామాగ్రి మొత్తం తమ దగ్గర కొంటేనే చెల్లుబాటు అవుతాయని చెబుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థుల పోషకులు యాజమాన్యాలు నిర్ణయించిన ధరలు చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల విక్రయ దందాను విద్యా శాఖ అధికారులు అరికట్టాలనే డిమాండ్‌లు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకుల నుంచి వినిపిస్తున్నాయి.

దిశ, నాగిరెడ్డిపేట్: ప్రైవేట్ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్దంగా అడ్డదారుల్లో యధేచ్చగా పాఠ్యపుస్తకాల వ్యాపారం జోరుగా సాగుతోంది. అయినా విద్యా శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఒకటి రెండు పాఠశాలలను స్థానిక విద్యాశాఖ అధికారులు తనిఖీ చేసినప్పటికీ వారికి పాఠ్యపుస్తకాల వ్యాపారం కనిపించకపోవడం శోచనీయం. ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఎలాంటి అనుమతులు లేకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో గల ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు ఓ దుకాణదారుడితో కుమ్మకై ప్రైవేట్ వ్యక్తుల ద్వారా విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని వారు పేర్కొన్నారు.

పాఠశాల యాజమాన్యం సూచించిన చోటే పుస్తకాల కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యాలు సూచిస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. నర్సరీ విద్యార్థులకు రూ.2,550,ఎల్‌కేజీకి రూ.2,550, యూకేజీకి రూ.3,075, మొదటి తరగతి నుంచి 5వ తరగతి వరకు రూ.4,045 వరకు వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు చదువు భారమైంది. ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే పాఠ్య పుస్తకాలకు సుమారు రూ.10వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని, దీంతో పాటు అదనంగా యూనిఫామ్, టై బెల్టులకు కూడా ఖర్చు అవుతుందని వాపోతున్నారు. అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పటికైనా అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్న వ్యాపారంను అరికట్టాలని తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై మండల విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డిని వివరణ కోరగా పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు రావడంతో బుధవారం దుకాణాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు సరసమైన ధరలకు పాఠ్య పుస్తకాలు అందించాలని సూచించడం గమనార్హం.

Next Story