రేగొండలో యువకుడి దారుణ హత్య

by Jakkula.Mamatha |

భూపాలపల్లి జిల్లారేగొండ మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు.

రేగొండలో యువకుడి దారుణ హత్య
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: భూపాలపల్లి జిల్లారేగొండ మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు యువకుడు వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తున్న అతనిపై తల్వార్‌తో నరికి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హంతకుల్లో ఒకరు పోలీసులకు లొంగిపోగా.. మరొకరు పరారీలో ఉన్నారు. రేగొండ మండలం రంగయ్య పల్లి గ్రామానికి చెందిన శ్రావణ్(35) అనే యువకుడు మండల కేంద్రంలోని వైన్స్ షాప్ ఎదుట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దుకాణం మూసేసి ఇంటికి బయలుదేరుతున్న సమయంలోఅప్పటికే పక్కా ప్లాన్‌తో మండల కేంద్రానికి చెందిన మల్లెబోయిన శ్రీకాంత్ అనే యువకుడు శ్రావణ్‌పై తల్వార్‌తో ఒక్కసారిగా విచక్షణారహితంగా దాడి చేశాడు.

దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో శ్రావణ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ దారుణ హత్య పై సమాచారం అందుకున్న ఎస్సై దాసరి సుధాకర్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రావణ్‌ను హత్య చేసిన అనంతరం మల్లెబోయిన శ్రీకాంత్ నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడని, ఈ ఘటనలో భాగస్వామి అయిన మరో యువకుడు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ఈ హత్యకు గల కారణం అక్రమ సంబంధమా లేక, పాత కక్షలా? లేక మరేదైనా వివాదమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story