- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బద్రీనాథ్ ఆలయంలోనూ విరాళాల చోరీ ఆరోపణలు
హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయం లో భక్తుల కానుకల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగంపై సాగుతున్న వివాదం సద్దుమణగ ముందే, హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయం (Badrinath Temple) లోనూ భక్తుల కానుకల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ (BKTC)కి చెందిన ఓ ఉద్యోగి ఆలయ విరాళాల సొమ్మును దొంగిలించాడని ఒక హిందూ సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది.
చైర్మన్ పీఏ పైనే ఆరోపణలు
'భైరవ్ సేన' అనే హిందూ సంస్థ అధ్యక్షుడు సంజీవ్ ఖత్రి ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. బీకేటీసీ (BKTC) చైర్మన్ పీఏ గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి భక్తులు సమర్పించిన కానుకలను, విరాళాల సొమ్మును స్వాహా చేశాడని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన ఒక లేఖ ప్రకారం.. ఈ ఘటన జూలై 2వ తేదీ ఉదయం 8:00 గంటల నుండి 8:30 గంటల మధ్య జరిగినట్లు ఖత్రి పేర్కొన్నారు. ఆలయ కమిటీలోని అంతర్గత వర్గాల ద్వారా తమకు ఈ సమాచారం అందిందని, ఆ తర్వాత తాము కూడా ప్రాథమిక ఆధారాలు సేకరించి బీకేటీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
SIT విచారణ జరపాలని డిమాండ్
భైరవ్ సేన ప్రతినిధులు బీకేటీసీ సీఈఓ సోహన్ సింగ్ రంగర్‌కు ఈ విషయమై ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటన జరిగినట్లు చెబుతున్న సమయానికి సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను బహిరంగపరచాలని వారు డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రత్యేక విచారణ బృందం (SIT) చేత నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని కోరారు. ఒకవేళ ఈ ఘటనపై అధికారులు స్పందించి, తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడతామని భైరవ్ సేన హెచ్చరించింది. కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న బద్రీనాథ్ ఆలయంలో ఇలాంటి ఆరోపణలు రావడం భక్తులలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






