జల్సాలకు అలవాటు.. ఆలయాల్లో చోరీలు

by Batti.Sumithra |

జల్సాలకు అలవాటు పడి పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న 19 ఏళ్ల యువకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కి జైలుపాలైన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది.

జల్సాలకు అలవాటు.. ఆలయాల్లో చోరీలు
X

దిశ, ఇచ్చోడ (ఆదిలాబాద్) : జల్సాలకు అలవాటు పడి పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న 19 ఏళ్ల యువకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కి జైలుపాలైన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్‌కు చెందిన కొలయం కాశినాథ్ (19) కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తూ ఉండేవాడు. జల్సాలకు అలవాటు పడి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితుడు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా పారిపోవడానికి యత్నించాడు. వెంటాడి పట్టుకుని విచారించగా తాను పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. విచారణలో నిందితుడిపై మొత్తం 11 కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, భీంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, మావల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు నమోదైనట్లు తెలిపారు. మార్చి నుంచి జూలై వరకు ఆదిలాబాద్ పట్టణం, భీంపూర్, తలమడుగు మండలాల్లోని పలు ఆలయాల్లో హుండీ నగదు, వెండి కళ్లు, వెండి నామాలు, వెండి చేతులు, వెండి విగ్రహాలు, బంగారు పుస్తెలు, బంగారు గుండ్లు, ఇత్తడి గంటలు, హారతి పళ్లాలు తదితర వస్తువులను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. చోరీ చేసిన బంగారం, వెండి వస్తువులను ఆదిలాబాద్ అశోక్ రోడ్డులోని బంగారు వ్యాపారి లోకాజీ విశ్వనాథ్ వద్ద విక్రయించేవాడని, అవి చోరీ సొత్తేనని తెలిసినా కొనుగోలు చేసినందుకు అతనిపై కూడా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 30 తులాల వెండి ఆభరణాలు, 2.5 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి కళ్లు (2), వెండి నామం (1), హోండా షైన్ మోటార్‌సైకిల్ (TG 01 1828), రెండు మొబైల్ ఫోన్లు, రూ.2,150 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆలయాలు, ప్రార్థనా స్థలాల్లో చోరీలకు పాల్పడే వారిపై, అలాగే చోరీ సొత్తు కొనుగోలు చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సై ప్రణయ్, పోలీసు సిబ్బంది భూపతి, నరేష్, క్రాంతి, కిషన్, సీసీఎస్ బృందం పాల్గొన్నారు.

Next Story