53 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రాష్ట్రం విఫలమైందన్న కిషన్ రెడ్డి

by Ramesh Naini |

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు.

53 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రాష్ట్రం విఫలమైందన్న కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్​జోషిని కలిసి ధాన్యం కొనుగోలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గన్నీ బ్యాగులు, గోడౌన్లు లేవు. రైస్ మిల్లుల వ్యవస్థ సరిగా లేదు.. దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉద్యమం చేసిన తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చింది.. 2024-25 ఖరీఫ్ కాలంలో 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, ఎఫ్​సీఐకి అప్పగించాల్సి ఉండగా ఇప్పటి వరకు కనీసం 13 శాతం కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వానికి కేంద్రంపై నెపం వేయడం తప్ప కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

గత 12 ఏళ్లలో ధాన్యం కొనుగోలు చేసేందుకు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1.16 లక్షల కోట్లు రుణాలను అందజేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. 2025-26లో ధాన్యం సేకరణ కోసం రూ.37 వేల కోట్లను ఇచ్చిందన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.22,700 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేసింది.. రైతుల సమస్యల కోసం ఢిల్లీలో ధర్నా చేయాలని కేటీఆర్ పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలసి ధర్నాకు వస్తే నిజాలేంటో బయట పడుతాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా నిధులు అందజేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. రైతుల ధాన్యం కొనుగోలు, గోడౌన్లకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. ప్రజలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ప్రతి కేజీలో 70 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది.. ఆ నిధుల ద్వారానే తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తోందని అన్నారు.

Next Story