AI Talent: ఏఐ టాలెంట్ కోసం పెరిగిన పోటీ

by S Gopi |

రిటైల్ జీసీసీల్లో పనిచేస్తున్న ఏఐ ప్రొఫెషనల్స్‌లో అయితే 54 శాతం మంది, అంటే సుమారు 4,200 మంది ఒక్క బెంగళూరులోనే ఉండటం గమనార్హం.

AI Talent: ఏఐ టాలెంట్ కోసం పెరిగిన పోటీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో రిటైల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు బెంగళూరు ఏఐ హబ్‌గా మారుతోంది. టీమ్‌లీజ్ డిజిటల్ తాజా నివేదిక ప్రకారం, దేశంలోని మొత్తం ఏఐ ప్రొఫెషనల్స్‌లో 30.6 శాతం మంది, అంటే దాదాపు 83,900 మంది బెంగళూరులోనే ఉన్నారు. రిటైల్ జీసీసీల్లో పనిచేస్తున్న ఏఐ ప్రొఫెషనల్స్‌లో అయితే 54 శాతం మంది, అంటే సుమారు 4,200 మంది ఒక్క బెంగళూరులోనే ఉండటం గమనార్హం. బెంగళూరు తర్వాత ఢిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్ ఏఐ టాలెంట్ పరంగా అగ్రస్థానాల్లో ఉన్నాయి. గతేడాదిలో రిటైల్ జీసీసీలు 28,500 మంది ప్రొఫెషనల్స్‌ను నియమించుకున్నప్పటికీ, వారిలో 90 శాతం మంది ఇతర రంగాల నుంచి వచ్చిన వారే కావడం ఈ విభాగంలో స్కిల్స్ కలిగిన టాలెంట్‌కు ఉన్న డిమాండ్‌ను సూచిస్తోంది. అయితే ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్నా, అనుభవజ్ఞుల కొరత మాత్రం పరిశ్రమకు పెద్ద సవాలుగా మారుతోంది. దేశంలోని 180 జీసీసీల్లో ఎనిమిదేళ్లకు పైగా ఏఐ అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ కేవలం 320 మంది మాత్రమే ఉన్నారని నివేదిక వెల్లడించింది. దీంతో ఏఐ టాలెంట్ కోసం జీసీసీలు ఐటీ, ప్రొడక్ట్ కంపెనీలు, కన్సల్టింగ్ సంస్థలు, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో తీవ్ర పోటీ నెలకొంది. దీనివల్ల 3-6 ఏళ్ల అనుభవం ఉన్న ఏఐ, మెషీన్ లెర్నింగ్ ప్రొఫెషనల్స్ ఏడాదికి మీడియం శాలరీ రూ.46 లక్షలకు చేరుకోగా, 15 ఏళ్లకు పైగా అనుభవం, డొమైన్ స్కిల్స్ ఉన్న టాప్ టాలెంట్‌కు రూ.1.2 కోట్లకు పైగా ప్యాకేజీలు అందుతున్నాయని నివేదిక పేర్కొంది.

Next Story