ఇబ్రహీంపట్నం మల్లన్న ఆలయంలో చోరీ

by Jakkula.Mamatha |

ఇబ్రహీంపట్నం మల్లికార్జున స్వామి(మల్లన్న) దేవాలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడి, హుండీని పగలగొట్టి సుమారు రూ.50 వేల మేర నగదు చోరీ చేసిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది

ఇబ్రహీంపట్నం మల్లన్న ఆలయంలో చోరీ
X

దిశ, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మల్లికార్జున స్వామి(మల్లన్న) దేవాలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడి, హుండీని పగలగొట్టి సుమారు రూ.50 వేల మేర నగదు చోరీ చేసిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని సాగర్ బైపాస్ రోడ్డు పక్కన ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి(మల్లన్న) దేవాలయం ఉంది. కాగా శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు హుండీ పగిలి ఉండడాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రాథమిక సమాచారం. కాగా, ఈ ఆలయంలో గతంలో కూడా చోరీ యత్నం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాత్రి వేళల్లో పోలీసు నిఘా పెంచాలని, ఆలయాలకు మరింత భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భక్తులు, గ్రామస్థులు కోరుతున్నారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story