ఒక్కసారిగా మారిన వాతావరణం.. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని ఐఎండీ ‘ఆరెంజ్ అలర్ట్’!

by Malleboina Mahesh |

దేశవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారింది! రాబోయే 48 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.

ఒక్కసారిగా మారిన వాతావరణం.. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని ఐఎండీ ‘ఆరెంజ్ అలర్ట్’!
X

దిశ, వెబ్ డెస్క్: ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా.. సాయంత్రానికి దేశవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే రెండు మూడు రోజుల పాటు తూర్పు, మధ్య ఈశాన్య భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. అలాగే ఆ రాష్ట్రాల్లో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. మార్చి 24 వరకు ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని, కొన్ని చోట్ల వడగళ్ల వానలు కూడా పడవచ్చని ఐఎండీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని వారు హెచ్చరించారు. రైతులు తమ కోతకు వచ్చిన పంటలను, ఆరబోసిన మిర్చి, పసుపు వంటి ఉత్పత్తులను తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు పొలాల్లో పనిచేసే వారు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు ప్రత్యేక అలర్ట్ జారీ చేశారు.

Next Story