- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"మూడో ప్రపంచ యుద్ధం ముంగిట? అమెరికా అణు క్షిపణి ప్రయోగం వెనుక అసలు రహస్యం!"
మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో అమెరికా ఖండాంతర న్యూక్లియర్ క్షిపణి ప్రయాగం పరీక్షించడం సంచలనం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా జరిపిన అణు క్షిపణి పరీక్ష ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య గత ఆరు రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో, అమెరికా తన అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు క్షిపణి 'మినిట్‌మ్యాన్-3' (Minuteman III)ని పరీక్షించడం సంచలనంగా మారింది. కాలిఫోర్నియా తీరంలోని వాండెన్‌బర్గ్ స్పేస్‌ఫోర్స్ బేస్ నుంచి మార్చి 3, మంగళవారం రాత్రి 11 గంటలకు నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతమైందని అమెరికా ఎయిర్‌ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. కేవలం క్షిపణిలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకే ఈ ప్రయోగాన్ని చేపట్టామని అమెరికా చెబుతున్నప్పటికీ, దీని వెనుక ఇరాన్‌కు ఒక పరోక్ష హెచ్చరిక ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయుధాలు లేని ఈ క్షిపణి పసిఫిక్ మహాసముద్రంలోని మార్షల్ ఐలాండ్స్‌లో ఉన్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు యూఎస్ స్పేస్‌ఫోర్స్ వెల్లడించింది. ఆరు రోజుల నుంచి ఇరాన్ ఎక్కడా తగ్గకుండా పోరాడుతున్న సమయంలో అమెరికా తన అణు సామర్థ్యాన్ని ప్రదర్శించడం గమనార్హం.
యుద్ధం ముగించేందుకేనా?
ఈ పరీక్షా వివరాలు బయటకు రాగానే అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆరు రోజులుగా సాగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించడానికి అమెరికా అణు దాడులకు ఏమైనా సిద్ధమవుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఒకవైపు, ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు మరోవైపు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి క్షిపణి ప్రయోగాలు శత్రుదేశాలకు శక్తివంతమైన సంకేతాలను పంపుతాయి. ఈ మినిట్‌మ్యాన్-3 క్షిపణి వేల మైళ్ల దూరంలోని లక్ష్యాలను నిమిషాల వ్యవధిలో నాశనం చేయగలదు. యుద్ధాన్ని నియంత్రించడానికి లేదా తమ వ్యూహాత్మక ఆధిపత్యాన్ని చాటుకోవడానికి అమెరికా ఈ చర్యకు పూనుకుని ఉండవచ్చని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రపంచ దేశాల్లో ఆందోళన
కాగా అమెరికా వైమానిక దళం చేపట్టిన అత్యంత శక్తివంతమైన అణు బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం కేవలం సాంకేతిక విన్యాసం మాత్రమే కాదు, ఇది ప్రపంచ దేశాలకు ముఖ్యంగా ఇరాన్ మరియు దాని మద్దతుదారులకు పంపిన బలమైన వ్యూహాత్మక హెచ్చరికగా రక్షణ నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా ఇటువంటి పరీక్షలు ముందుగానే నిశ్చయించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని అమెరికా స్పేస్ ఫోర్స్ సమర్థించుకుంటున్నప్పటికీ, మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రస్థాయికి చేరిన సమయంలో ఈ ప్రయోగం జరగడం యాదృచ్ఛికం కాదనిపిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ తన క్షిపణి దాడులతో వెనక్కి తగ్గకపోవడాన్ని గమనించిన అమెరికా, తన అణు సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో ప్రదర్శించడం ద్వారా శత్రు దేశాల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తోంది. వేల మైళ్ల దూరాన్ని అతి తక్కువ సమయంలో చేరుకోగల ఈ క్షిపణి ప్రయోగం ద్వారా, అవసరమైతే ఏ క్షణంలోనైనా ప్రపంచంలో ఏ మూలన ఉన్న లక్ష్యాన్ని అయినా అమెరికా అణు ఆయుధాలతో ధ్వంసం చేయగలదని చాటిచెప్పినట్లయింది.
చరిత్ర చెబుతోంది ఇదే!
మరోవైపు, అణు దాడులకు అమెరికా సిద్ధమవుతోందా అనే అనుమానాలు బలపడటానికి గతంలో జపాన్‌పై జరిగిన హిరోషిమా, నాగసాకి దాడుల చరిత్రే కారణం. యుద్ధాలను త్వరగా ముగించడానికి లేదా శత్రువును లొంగదీసుకోవడానికి అణు ప్రయోగం ఒక అంతిమ ఆయుధంగా మారుతుంది. నేటి ఆధునిక కాలంలో అణు యుద్ధం అంటే అది కేవలం రెండు దేశాల మధ్య పోరు కాకుండా, మానవాళి మనుగడకే ప్రమాదంగా మారుతుంది కాబట్టి అమెరికా నేరుగా అణు దాడికి దిగుతుందని చెప్పలేం. కానీ, ఈ పరీక్ష నిర్వహించడం ద్వారా "మేము సిద్ధంగా ఉన్నాం" అనే సంకేతాలను రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలకు పంపడం ద్వారా వాటిని ఒత్తిడిలోకి నెట్టడం అమెరికా అసలు వ్యూహం కావచ్చు. ఈ పరిణామం రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్య యుద్ధ గమనాన్ని ఎలా మారుస్తుందో వేచి చూడాలి.






