రైతులను ముంచే యూరియా యాప్‌ను ఎత్తివేయాలి : పల్లెపు వెంకటేష్

by Batti.Sumithra |

కేంద్ర ప్రభుత్వం రైతులను నిట్టనిలువునా ముంచేందుకు యూరియా యాప్‌ను తీసుకొచ్చిందని, వెంటనే ఆ యాప్‌ను ఎత్తివేయాలని సీపీఎం నాయకులు పల్లెపు వెంకటేష్, కూతాడి ఎల్లయ్య డిమాండ్ చేశారు.

రైతులను ముంచే యూరియా యాప్‌ను ఎత్తివేయాలి : పల్లెపు వెంకటేష్
X

దిశ, ఆర్మూర్ : కేంద్ర ప్రభుత్వం రైతులను నిట్టనిలువునా ముంచేందుకు యూరియా యాప్‌ను తీసుకొచ్చిందని, వెంటనే ఆ యాప్‌ను ఎత్తివేయాలని సీపీఎం నాయకులు పల్లెపు వెంకటేష్, కూతాడి ఎల్లయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రినగర్‌లో గల సీపీఎం కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లెపు వెంకటేష్, డివిజన్ కమిటీ సభ్యులు కొండ గంగాధర్, కూతాడి ఎల్లయ్య, నవీద్ పాల్గొన్నారు.

అనంతరం సీపీఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ప్రజలపై భారాలు మోపడం తప్ప మరొకటి చేయడం లేదని విమర్శించారు. రైతుల ప్రభుత్వమని చెప్పుకుంటూనే రైతులకు యూరియా యాప్‌ను తీసుకొచ్చి, ప్రస్తుతం వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. వెంటనే ఆ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ స్మార్ట్‌ఫోన్లు లేకపోవడంతో, సాధారణ ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణమే యాప్‌ను రద్దు చేయాలని కోరారు. అలాగే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల ధరలను విపరీతంగా పెంచి వారి నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఒకవైపు సామాన్య ప్రజలపై పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి భారాలు మోపుతూనే, మరోవైపు రైతులను కూడా ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. మొత్తంగా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. తక్షణమే ఈ విధానాలను విరమించుకుని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్‌లో తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతం అదనంగా కలిపి ఇచ్చే సీ2+50 శాతం (C2+50%) విధానాన్ని అమలు చేయాలని కోరారు. అదేవిధంగా రబీ పంటలకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. లేనిపక్షంలో రైతులతో కలిసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Next Story