- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండాల్లో గిరిజనుల సంప్రదాయ వైభవం
రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలోని వివిధ గిరిజన తండాల్లో లంబాడీ (బంజారా) గిరిజనులు తమ ఆరాధ్య దేవత అయిన సీత్లా భవానీ పండుగను మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు.

దిశ, కోనరావుపేట: ప్రకృతిని పూజిస్తూ ఘనంగా సీత్లా భవానీ పండుగ నిర్వహించిన గిరిజనులు. రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలోని వివిధ గిరిజన తండాల్లో లంబాడీ (బంజారా) గిరిజనులు తమ ఆరాధ్య దేవత అయిన సీత్లా భవానీ పండుగను మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే తండాల్లో ప్రత్యేక పూజలు, సంప్రదాయ ఆచారాలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని కొలిచారు. ఈ సందర్భంగా లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ఇంచార్జ్, సర్పంచ్ నరేష్ నాయక్ మాట్లాడుతూ.. సీత్లా భవానీ పండుగ ప్రకృతిని, పశుసంపదను, వ్యవసాయాన్ని ఆరాధించే అత్యంత పవిత్రమైన గిరిజన పండుగ అని తెలిపారు.
ఈ పండుగను "దాటుడు పండుగ" అని కూడా పిలుస్తారని చెప్పారు. ప్రతి సంవత్సరం పెద్ద పూసల కార్తెలో వచ్చే మంగళవారం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడి, పశువులు ఆరోగ్యంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఈ పండుగ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. లంబాడీ గిరిజనుల సంప్రదాయంలో అత్యంత విశిష్ట స్థానాన్ని కలిగిన సప్త భవానీలను ప్రత్యేకంగా పూజిస్థామని వాటిలో తుల్జా భవానీ, మెరమ్మ భవాని, సీత్లా భవాని, హింగ్లజ్ భవాని, మంత్రాల్ భవాని, ద్వాల్ అంగల్ భవాని తదితర దేవతలను భక్తిశ్రద్ధలతో కొలుస్తారని అన్నారు.
తండాల్లో మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని ప్రత్యేక నైవేద్యం సమర్పించగా, యువతులు, చిన్నారులు కూడా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా తండా ప్రజలు ఒకచోట చేరి సామూహిక ప్రార్థనలు నిర్వహించి గ్రామంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడేలా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దలు గిరిజన సంప్రదాయాలు యువతకు వివరించగా, పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలను భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, యువకులు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీత్లా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.






