కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. భూములను తిరిగి ఇవ్వాలని రైతుల ధర్నా

by Batti.Sumithra |

అటవీ భూముల పేరుతో ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్న రైతుల సాగు భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ సుర్దాపూర్ గ్రామ రైతులు మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. భూములను తిరిగి ఇవ్వాలని రైతుల ధర్నా
X

దిశ, ఆసిఫాబాద్ : అటవీ భూముల పేరుతో ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్న రైతుల సాగు భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ సుర్దాపూర్ గ్రామ రైతులు మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఎమ్మెల్యే కోవలక్ష్మి మద్దతు తెలుపుతూ రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం రైతులతో కలిసి కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ రైతులు దశాబ్దాలుగా సాగుచేస్తున్న భూములను అటవీ భూముల పేరుతో ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం తీవ్ర అన్యాయమని మండిపడ్డారు. గత 40 నుంచి 50 సంవత్సరాలుగా రైతులు ఈ భూములను సాగు చేసుకుంటున్నారని, ఇన్నేళ్లు గుర్తుకు రాని అటవీ భూములు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సమయంలోనే అధికారులకు ఎలా గుర్తుకు వస్తాయని ప్రశ్నించారు.

ఎండాకాలంలో అధికారులు ఏం చేశారని నిలదీశారు. ఫారెస్ట్ అధికారుల పనితీరు పై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేనివిధంగా పోడు రైతులను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలను డీఎఫ్‌వో, పీసీసీఎఫ్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని విమర్శించారు. ప్రస్తుతం రైతులు ఇప్పటికే పొలాల్లో విత్తనాలు వేసినందున, ఈ ఏడాది పంట సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే ఏడాది భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల సంయుక్త సర్వే నిర్వహించాలని సూచించారు. ఈ విషయం పై రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోవలక్ష్మి రైతులతో కలిసి డీఎఫ్‌వో కార్యాలయాన్ని ముట్టడించారు. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.

Next Story