- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పోరాటమే మమ్మల్ని కలిపింది.. ఐదు దశాబ్దాల స్నేహాన్ని గుర్తు చేసుకున్న బండారు దత్తాత్రేయ!
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మార్గంలో మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ జడ్చర్లలో ఆగారు.

దిశ, జడ్చర్ల: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మార్గంలో మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ జడ్చర్లలో ఆగారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో తనతో కలిసి MISA చట్టం కింద అరెస్టై చంచల్‌గూడ జైలులో నిర్బంధ జీవితం గడిపిన తన ఆత్మీయ మిత్రుడు, జడ్చర్లకు చెందిన మంచేన గుండేరావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. "ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగిన పోరాటమే మమ్మల్ని కలిపింది. ఆ రోజుల్లో ఏర్పడిన స్నేహబంధం 50 ఏళ్లు దాటిన నేటికీ అలాగే కొనసాగుతుంది" అని అన్నారు.
గుండేరావుని శాలువాతో సత్కరించిన దత్తాత్రేయ, ఎమర్జెన్సీ నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యం కోసం గుండేరావు చేసిన త్యాగాలు, దేశభక్తి చిరస్మరణీయమన్నారు. ఆయన కేవలం పోరాట యోధుడే కాకుండా ప్రముఖ సాహితీవేత్త, కవి, ఆధ్యాత్మికవేత్త అని కొనియాడారు. 83 ఏళ్ల వయసులోనూ ఆధ్యాత్మిక, సామాజిక సేవల్లో చురుకుగా ఉంటున్న గుండేరావు సమాజానికి ఆదర్శమని ప్రశంసించారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు ఎడ్ల అమర్నాథ్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రాపోతుల శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ సీతారాం జౌహార్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహితీ రెడ్డి, సీనియర్ నాయకులు ముచ్చర్ల కృష్ణయ్య, పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు చంద్రయ్య, కిసాన్ మోర్చా నాయకులు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






