వరద నీటి కల్వర్టులకు దారేది?

by Taduka Kalyani |

రోడ్డు నిర్మాణ పనులు,నాణ్యతపై దృష్టి సారించాల్సిన పిఆర్ ఏఈ నిర్లక్ష్యం గ్రామస్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపనున్నది.

వరద నీటి కల్వర్టులకు దారేది?
X

దిశ, కారేపల్లి: రోడ్డు నిర్మాణ పనులు,నాణ్యతపై దృష్టి సారించాల్సిన పిఆర్ ఏఈ నిర్లక్ష్యం గ్రామస్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపనున్నది. మరోవైపు అభివృద్ధిలో భాగంగా చేపట్టిన రహదారి పనులు గిద్దవారిగూడెం గ్రామస్థులకు వరంగా మారాల్సి ఉండగా నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, పర్యవేక్షణలో ఏఈ నిర్లక్ష్యం కారణంగా గ్రామస్థులకు నేడు శాపంగా మారింది. మండల పరిధిలో ఇటీవల గిద్దవారిగూడెం గ్రామపంచాయతీ నుంచి బజ్యాతండా వరకు రూ.82 లక్షల వ్యయంతో లింకు రహదారి నిర్మాణ పనులు చేపట్టారు.ఈ క్రమంలో ఒకవైపు నుంచి మరోవైపుకు వరద నీరు తరలి వెళ్లేందుకు అణువుగా ఏర్పాటు చేసిన కల్వర్టులను నిర్మాణ పనుల్లో భాగంగా మట్టితో మూసివేశారు.వర్షాకాలం సమీపించిన తరుణంలో వర్షపు నీటి వరద బయటకు వెళ్లడానికి ఈ కల్వర్టులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇంజనీరింగ్ అధికారి పర్యవేక్షణ లోపంతో కల్వర్టులు మట్టితో పూర్తిగా మూసివేయబడ్డాయి. నీటి పారుదలపై ముందస్తు ప్రణాళిక లేకుండా జరిగిన ఈ తప్పిదం కారణంగా వర్షపు నీరు గ్రామంలోని ఇండ్లలోనే చేరిపోయి బురదమయం కావడంతోపాటు దోమలకు స్థావరాలుగా మారి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఇంజనీరింగ్ అధికారి పర్యవేక్షణ లోపం తోడవ్వడంతో గ్రామంలోని అంతర రహదారులపై రెండు అడుగులకు పైగా నీరు నిలిచిపోయిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో రోజుల తరబడి నీరు నిల్వ చేరి దోమలకు స్థావరాలుగా మారడం,బడి పిల్లలకు, వృద్ధులకు తీవ్ర ఇబ్బందులు ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.పేరుకుపోయిన బురద నీటిలోనే నిలబడి పలువురు స్థానికులు మంగళవారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.స్థానికుల కథనం ప్రకారం గతంలో ఉన్న కల్వర్టులను పునర్నిర్మించి, వరద నీరు దిగువ ప్రాంతాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సి ఉన్న తరుణంలో రహదారి పనులు చేపట్టిన అనంతరం రోడ్డు ఎత్తు పెరగడం, కల్వర్టులను మూసివేయడం కారణంగా వర్షపు నీరు అర్ధాంతరంగా నిలిచిపోయి కొత్త సమస్యకు దారి తీసిందని, భారీ వర్షాలు నమోదైతే గ్రామంలోని అంతర్గత రహదారులు చెరువులను తలపించడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసినా అధికారి నుండి స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు.సమస్య జటిలమవుతున్న తరుణంలో స్థానికులు ఈ విషయాన్ని పలుమార్లు పంచాయతీరాజ్ ఏఈ రాజశేఖర్ దృష్టికి తీసుకెళ్లిన క్రమంలో ఏఈ వద్ద నుంచి నిర్లక్ష్యపు ధోరణితో సమాధానం వస్తున్నదని, అధికారి తీరు పట్ల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Next Story