మూగజీవాల దందా!

by Jakkula.Mamatha |

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ కేంద్రంగా పశువుల అక్రమ రవాణా దందా యథేచ్ఛగా సాగుతోంది.

మూగజీవాల దందా!
X

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ కేంద్రంగా పశువుల అక్రమ రవాణా దందా యథేచ్ఛగా సాగుతోంది. ఓ మాజీ కౌన్సిలర్ సూత్రధారిగా, నలుగురు దళారులు పాత్రధారులుగా భారీ నెట్‌వర్క్‌తో ఈ దందాను నడిపిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు పశువులను కొని, సరిహద్దు మార్గాల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తూ రూ.లక్షలు అర్జిస్తున్నారు. తాజాగా కర్జెవెల్లి వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు జైల్లో వాహనంలో క్రూరంగా తరలిస్తున్న 7 పశువులను రక్షించారు. జైలుకు వెళ్లిన నిందితులు బెయిల్‌పై వచ్చి మళ్లీ పాత ముఠాతో కలిసి దందాను షురూ చేయడం గమనార్హం. పోలీసులు మామూళ్ల మత్తులో మౌనం వహిస్తున్నారని, వెంటనే చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దిశ, కాగజ్‌నగర్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో పశువుల అక్రమ రవాణా దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఒక మాజీ కౌన్సిలర్ ముఖ్య సూత్రధారిగా వ్యవహరిస్తూ, మరో నలుగురు దళారులతో కలిసి ఈ నల్ల దందాను నడిపిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసి, కౌటాల సరిహద్దు మార్గాల ద్వారా కాగజ్‌నగర్ చేరవేస్తున్నారు. ఇక్కడి రహస్య స్థావరాల్లో వాటిని దాచి, రాత్రికి రాత్రే హైదరాబాద్‌ తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు.

వాహనాల్లో ఊపిరాడక విలవిల..

ఈ ముఠా పశువులను తరలించే క్రూరత్వ విధానం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవక మానదు. డీసీఎం వ్యాన్లు, బొలెరో, కార్ల వంటి వాహనాల్లో సామర్థ్యానికి మించి పదుల సంఖ్యలో మూగజీవాలను ఒకదానిపై ఒకటి కుక్కుతున్నారు. నిలబడటానికి, శ్వాస పీల్చుకోవడానికి కూడా వీలు లేని రీతిలో ముక్కు తాళ్లతో కట్టేసి, రక్తం ఓడుతున్నా పట్టించుకోకుండా రవాణా చేస్తున్నారు. ఈ భయంకర ప్రయాణంలోనే అనేక పశువులు ఊపిరాడక దారిలోనే ప్రాణాలు వదులుతున్నాయి.

తాజాగా కర్జెవెల్లి వద్ద 7 పశువుల పట్టివేత..

ఈ అక్రమ రవాణా శృంఖలానికి అద్దం పట్టేలా తాజాగా చింతలమానేపల్లి మండలం కర్జెవెల్లి గ్రామ శివారులో పోలీసుల తనిఖీల్లో మరో వాహనం చిక్కింది. ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఒక మహీంద్రా జైలో వాహనం వారిని చూసి కొంత దూరంలో ఆగిపోయింది. అనుమానించిన పోలీసులు వెళ్లేలోపే డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా ఎలాంటి అనుమతులు లేకుండా, తాళ్లతో క్రూరంగా కట్టి వధశాలకు తరలిస్తున్న 7 మూగజీవాలు లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు పశువులను రక్షించి, వాహనాన్ని స్వాధీనం చేసుకుని, పారిపోయిన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

జైలుకెళ్లినా లొంగని దళారి.. లీడర్ల ముసుగులో దందా..

రెండు నెలల క్రితమే ఇదే తరహా అక్రమ రవాణా ఉదంతంలో ఒక నిందితుడు అరెస్ట్ అయి రిమాండ్‌కు వెళ్లినా, దళారుల్లో ఏమాత్రం భయం కలగలేదు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన నెల తిరక్కుండానే సదరు నిందితుడు పాత ముఠాతో చేతులు కలిపి మళ్లీ దందాను షురూ చేశాడు. కళ్ల ముందే ఇంత బహిరంగంగా అక్రమ రవాణా సాగుతున్నా ఖాకీల కళ్లకు గంతలు కట్టుకొని మౌనంగా ఉండటం వెనుక భారీగా నెలవారీ మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని సంఘాల ముఖ్య నాయకులే ప్రజా సేవ ముసుగులో ఉంటూ, దళారుల నుంచి వాటాలు అందుకుంటూ ఈ దోపిడీకి తెరవెనుక నిలుస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టి, చెక్‌పోస్టులను బలోపేతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story