ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది

by Batti.Sumithra |

నిత్య జీవితంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ నేడు పర్యావరణానికే కాకుండా మానవ ఆరోగ్యానికి పెను సవాల్‌గా మారిందని పర్యావరణ నిపుణులు హెచ్చరించారు.

ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది
X

దిశ, చంపాపేట్ : నిత్య జీవితంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ నేడు పర్యావరణానికే కాకుండా మానవ ఆరోగ్యానికి పెను సవాల్‌గా మారిందని పర్యావరణ నిపుణులు హెచ్చరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ వస్తువులను అలవాటు చేసుకోవడం ద్వారానే భావితరాలకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించగలమని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సోమవారం హరిబోలిలోని రిఫాయం హైస్కూల్‌లో భారీ అవగాహన సదస్సుతో పాటు ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ భూమిలో పూర్తిగా కరిగిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుందని, దీంతో భూమి, నీరు, గాలి తీవ్రంగా కలుషితమవుతున్నాయని చెప్పారు. కాలక్రమేణా ప్లాస్టిక్ సూక్ష్మకణాలుగా (మైక్రో ప్లాస్టిక్స్) మారి ఆహారం, తాగునీటి ద్వారా మానవ శరీరంలోకి చేరి క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతున్నాయని శాస్త్రీయ ఆధారాలతో వివరించారు.

ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ సి. ఉమా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, డబ్బాల్లో వేడి టీ, కాఫీ, ఆహారం తీసుకోవడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి అలవాట్లు హార్మోన్ల అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గుదల, క్యాన్సర్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ పి. సాయికుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం వల్ల వెలువడే విష వాయువులు గాలి కాలుష్యాన్ని పెంచి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయని పేర్కొన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారేయకుండా శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలని సూచించారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ, గత 40 సంవత్సరాలుగా తమ సంస్థ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఓజోన్ పొర సంరక్షణ, వృక్షారోపణ, ప్రజా చైతన్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ వస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జ్ఞాన భారతి మోడల్ హైస్కూల్ (గౌలిపుర), రిఫాయం హైస్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు మెడల్స్, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు.

అలాగే తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ పాతబస్తీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఉత్తం కొఠారిని శాలువా, జ్ఞాపిక, నియామక పత్రంతో అతిథులు సన్మానించి అభినందించారు. అంతకుముందు సుధా టాకీస్ వద్ద ప్రారంభమైన ప్లాస్టిక్ వ్యతిరేక భారీ ర్యాలీ కోవా బేలా–హరిబోలి–శాలిబండ మార్గంలో కొనసాగింది. విద్యార్థులు చేతుల్లో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని “ప్లాస్టిక్‌కు నో చెప్పండి – పర్యావరణాన్ని కాపాడండి”, “గుడ్డ సంచులు వాడండి – భవిష్యత్‌ను రక్షించండి” వంటి నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీసీసీ కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది మహమ్మద్ అక్తర్ షరీఫ్, సీనియర్ నాయకుడు సిద్ధేష్ ముదిరాజ్, పాఠశాల కరస్పాండెంట్ ఎస్. పుల్లారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు కే. నీరజ, సలహాదారు ఎం. విద్యావతి, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు, పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “ప్రకృతిని పరిరక్షించడం అంటే మనల్ని మనం రక్షించుకోవడమే. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ప్రతి పౌరుడి బాధ్యత” అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.

Next Story