- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరిషత్ ఎన్నికలకు పరీక్షల గండం!
తెలంగాణ పరిషత్ ఎన్నికల నిర్వహణకు విద్యార్థులు పరీక్షల షెడ్యూల్ అడ్డంకిగా మారింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఎన్నికల జాతర కొనసాగుతోంది. గత డిసెంబర్ లో పంచాయితీ ఎన్నికలు 3 దశల్లో జరగగా.. ఇటీవల ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎలెక్షన్స్ కూడా ముగిసాయి. అయితే తరువాత జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఫిబ్రవరి చివరి వారం, మార్చి, ఏప్రిల్ లో వరుస పరీక్షల కారణంగా పరిషత్ ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాగా సాధారణంగా రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలతో పాటే పరిషత్ ఎన్నికలు కూడా జరగడం ఆనవాయితీ. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన ఎన్నికల హామీ పెండింగ్ లో ఉండటం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు 42% బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చాయి. మరోవైపు బీసీ రిజర్వేషన్లు ఇచ్చాకే గ్రామపంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.
ఈ మేరకు విపక్షాల సహాయంతో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. అయితే అది అక్కడితోనే ఆగిపోయిందని చెప్పుకోవాలి. బిల్లు ఆమోదం కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వద్దకు ఫైలును పంపగా.. న్యాయసలహా అంటూ.. గవర్నర్ కేంద్రానికి పంపించారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన ఆ బిల్లు పార్లమెంటులో కూడా ఆమోదం పొందాల్సి ఉండగా.. ఇప్పటివరకు అది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. ఈలోపు రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల సమయం మించిపోవడంతో సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించమని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని దాఖలైన పిటిషన్లపై కూడా విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇక తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇరుకున పడింది.
న్యాయసలహా అనంతరం.. తమ పార్టీ తరపున బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించుకొని.. పంచాయితీ ఎన్నికలు, తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించింది సర్కారు. ఇంకా పరిషత్ ఎన్నికలు, GHMC ఎన్నికలు మిగిలి ఉండగా.. వాటిని కూడా మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంది. లేదంటే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.498 కోట్ల నిధులు ఆగిపోయే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడే అసలు చిక్కంతా ఉంది. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి, ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం 20 రోజుల సమయం అయినా పడుతుంది. కానీ ఈనెల 25 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు, మార్చి 14 నుంచి 10వ తరగతి పరీక్షలు.. ఆ తరువాత పలు పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో మార్చి 31లోగా ఎన్నికలు నిర్వహించడం దాదాపు అసాధ్యం అనే అనిపిస్తోంది.
ఈ సమయంలో ఎన్నికల షెడ్యూల్ రూపొందించడం అత్యంత కష్టమైనదిగా కూడా ఎలెక్షన్ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. మరి జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పరిషత్ ఎన్నికలే కీలక చర్చాంశనీయంగా మారనున్నట్టు సమాచారం. మరోవైపు పరిషత్ ఎన్నికల ఆశావాహులు కూడా తమ సాధ్యాసాధ్యాలపై లెక్కలు వేసుకుంటూ ఇప్పటి నుంచే ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.






